కరోనా వైరస్ భయం ఇప్పుడు జనాల్లో మరింతగా పెరిగిపోతోంది. ఎక్కడికక్కడ కేసులు నమోదు అవుతుండడం, ప్రతి ఊర్లో ఇప్పుడు కరోనా కేసులు ఉండడం, నిత్యం వందలు, వేల కొద్ది కేసులు నమోదు అవుతుండడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  కరోనా కట్టడి కోసం ఇప్పటికే ఎక్కడికక్కడ రెడ్ జోన్ లు, బఫర్ జోన్ లు అంటూ ప్రకటిస్తూ వస్తున్నారు అలాగే దేశవ్యాప్తంగా మరో సారి కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేయాలనే డిమాండ్ లు కూడా పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అందరికీ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఏపీలో నమోదు అవుతున్న కేసులు మాత్రం జనాలను బాగా భయపెట్టే విధంగా ఉన్నాయి.

 


 ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ, ప్రమాదంలోకి వెళ్తున్నట్టు గా కనిపిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ వైరస్ ప్రభావానికి గురయినట్టుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడికి ఈ వైరస్ సోకింది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడికి కూడా ఈ వైరస్ సోకింది. 

 


ఇంకా ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఈ వైరస్ ప్రభావానికి గురవ్వడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కరోనా సోకిన ఐఏఎస్ లంతా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టుగా  తెలుస్తోంది. కాకపోతే వీరికి కరోనా సోకినా వీరికి ఎటువంటి వైరస్ లక్షణాలు కనిపించడం లేదట. ఈ ముగ్గురే కాకుండా, మరో ఇద్దరు మహిళా అధికారులు కూడా వైరస్ సోకినట్లు గా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు విధులు నిర్వహించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. సచివాలయ ఉద్యోగులను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వేర్వేరు శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఇప్పటికే 15 మందికి ఈ వైరస్ సోకడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: