రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఆడియో టేపులు బయటపెట్టి కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా.. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు రాజస్థాన్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. 

 

రాజస్థాన్‌ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో టేపులు నకిలీవని బీజేపీ ఆరోపించింది. తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కాంగ్రెస్‌ ఈ కుట్రకు తెరతీసిందని మండిపడింది. అలాగే రాజకీయ నాయకుల ఫోన్ ల ట్యాపింగ్‌ జరిగిందో.. లేదో.. ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. చేస్తే.. నిబంధనల్ని పాటించారా అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

 

కాంగ్రెస్‌లో గత కొంత కాలంగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని బీజేపీ గుర్తుచేసింది. స్వయంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గత కొన్ని రోజులుగా ఉపముంఖ్యమంత్రిగా కొనసాగిన సచిన్‌ పైలట్‌తో మాటలు లేవని చెప్పడమే దానికి నిదర్శనమని చెప్పింది.  అంతకుముందు ఆడియో టేపుల విషయంలో భాజపా నేత లక్ష్మీకాంత్‌ భరద్వాజ్‌.. కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, గోవింద్‌ సింగ్‌ దోస్తారాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఆడియో టేపుల్లో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను అకారణంగా కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిరోజు మహేశ్‌ జోషి, సూర్జేవాలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వ వైఫల్యాల్ని బీజేపీపైకి నెట్టివేయడానికే ఇలాంటి కుట్రకు తెరతీశారని ఆరోపించారు.

 

మరోవైపు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన చట్ట  వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సోషల్ మీడియా వేదికగా ఆమె డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్  వ్యవహారంలో బీజేపీ సీబీఐ విచారణ కోరిన కొద్ది క్షణాల్లోనే మాయావతి డిమాండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: