ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణలో భాగంగా... సుప్రీంకోర్టులో రెబల్ వర్గం నేత సచిన్ పైలట్‌కు ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు..సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పాత్రపై దర్యాప్తు చేయాలని జైపూర్ కోర్టు ఆదేశించింది.
రాజస్థాన్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతూ రక్తికట్టిస్తోంది. స్పీకర్ స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి మరోసారి ఊరట లభించింది. రేపు సచిన్ పైలెట్ వర్గం పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాల అమలు మాత్రం సుప్రీంకోర్టులో వచ్చే ఫలితంపైనే ఆధారపడి ఉండాలని జస్టిస్ అరుణ్ మిశ్రా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపించలేరా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ మిశ్రా ప్రశ్నించారు. అంతేకాకుండా అసమ్మతి స్వరాన్ని అణచివేయలేరన్నారు. అంతకుముందు స్పీకర్ తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్... రాజస్థాన్ హైకోర్టులోని కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. దీనిపై ఇప్పటికిప్పుడు అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్ విచక్షణాధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని కపిల్ సిబల్ వాదించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. స్పీకర్ అనర్హత వేటుపై నిర్ణయం తీసుకున్నాకే న్యాయసమీక్షకు అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందనే ప్రశ్న లేవనెత్తారు. ఈ అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
మరోవైపు...సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పాత్రపై దర్యాప్తు చేయాలని జైపూర్ కోర్టు ఆదేశించింది. 884 కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన పాత్రపై నిగ్గు తేల్చాలని రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ని ఆదేశించింది. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంపై.. ఎస్ఓజీ ఏడాది నుంచి దర్యాప్తు చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి