దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ఆందోళనను పెంచుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలోని దూద్ బావి దగ్గర జనం బారులు తీరుతున్నారు. అమృతం వలె తియ్యగా ఉండే ఆ నీటికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గొంతులో పోస్తే ఆపకుండా అరలీటరుకు పైగా గుటగుటా తాగేంత రుచిగా దూద్ బావి నీళ్లు ఉంటాయి.
ఎన్నో ఔషధగుణాలు ఉన్న ఈ జలం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలోని దూద్ బావిలో మాత్రమే లభిస్తుంది. ఒక్కసారి నీళ్లు తాగితే మళ్లీ మళ్లీ తాగాలనిపించేంత తియ్యగా ఉండే ఈ నీళ్లలో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఏ మాత్రం కనపడవు. మొలంగూర్‌లో సైనికుల కోసం కాకతీయ రాజులు ఈ బావిని తవ్వించారు. ఈ బావికి ఉన్న చరిత్ర అంతాఇంతా కాదు. జిల్లాలోనే ఎత్తైన కట్టడంగా భావించే మొలంగూర్ ఖిల్లా దిగువ భాగంలో ఊడలమర్రి కింద ఉన్న దూద్‌బావి స్వచ్ఛమైన నీటికి ప్రసిద్ధికెక్కింది.
మినరల్ వాటర్ కంటే ఎంతో రుచిగా ఉండే ఈ నీళ్లను గుర్రపు బగ్గీల్లో హైదరాబాద్‌లోని నిజాం నవాబు కుటుంబానికి సరఫరా చేసేవారని చరిత్ర చెబుతోంది. ఇతర ప్రాంతాల నుంచి ఈ బావి నీళ్లు తాగడానికి ప్రజలు వస్తుంటారంటే దూద్ బావి ప్రాముఖ్యత సులువుగానే అర్థమవుతుంది. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఈ బావి నీళ్లు తాగితే కరోనా సోకదని స్థానికులు విశ్వసిస్తున్నారు.
నీళ్లు తాగితే తీయగా ఉండడంతో ఈ బావికి దూద్ బావి అని పేరొచ్చింది. మోకాళ్లు, కీళ్ల నొప్పులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, తదితర సమస్యలతో బాధపడేవాళ్లు ఈ నీళ్లను తాగిన తరువాత ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఎండకాలంలో కూడా ఎండిపోకపోవడం ఈ బావి ప్రత్యేకత. కొంతమంది ఈ నీటిని విక్రయించి జీవనం గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం డ్రమ్ముల్లో నీటిని తీసుకెళ్లి పట్టణంలోని హోటళ్లు, కార్యాలయాలు, ఇళ్లలో విక్రయిస్తూ క్యాన్ కు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి