భారత్ ను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో చిన్నారులకు కొవిడ్, ఇతర అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉందని కీలక ప్రకటన చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ జాయింట్ మానిటరింగ్ ప్రోగ్రాం (జేఎంపీ) గణాంకాల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
దేశంలోని ప్రతి మూడు పాఠశాలల్లో ఒక పాఠశాలలో మాత్రమే శానిటేషన్, పరిశుభ్రత (వాషింగ్), తాగునీరులాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అందువల్ల మన దేశంలోని చిన్నారులకు కరోనాతో పాటు ఇతర అంటువ్యాధుల ముప్పు కూడా ఎక్కువేనని చెబుతోంది. భారత్ లోని పలు స్కూళ్లలో చేతులను శుభ్రం చేసుకునే సదుపాయం ఉన్నా సబ్బు అందుబాటులో ఉండదని పేర్కొంది.
 
2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 462 మిలియన్ల మంది చిన్నారులకు వారి పాఠశాలల్లో పరిశుభ్రత సేవలు అందుబాటులో లేవని ఇందులో 92 మిలియన్ల మంది చిన్నారులు భారత్ కు చెందిన వారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 43 శాతం స్కూళ్లలో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునే కనీస సదుపాయాలు లేవని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలను పూర్తి రక్షణ మధ్య తెరిచేందుకు కనీస సదుపాయాలు అవసరమని పేర్కొంది.
 
60 దేశాల్లో చిన్నారులు ఆరోగ్య పరంగా అత్యధిక ముప్పు ఎదుర్కొంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ/యూనిసెఫ్ జాయింట్ జేఎంపీ నివేదిక అభిప్రాయపడింది. ప్రతి నలుగురిలో ముగ్గురికి స్కూళ్లలో చేతులు శుభ్రం చేసుకునే సదుపాయం కూడా లేదని పేర్కొంది. సగం మంది చిన్నారులకు నీటి సదుపాయమే లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు స్కూళ్లలో ఒక స్కూల్ లో తాగునీటి సదుపాయం కూడా లేదని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పట్ల భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: