జిహెచ్ఎంసి ఎన్నికల జోరు రాజకీయరంగంలో పరుగులు తీస్తోంది. అన్ని పార్టీల కార్యకర్తలు బరిలోకి దిగి వారి వారి  పార్టీలను గద్దె ఎక్కించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వారి అనుభవాలను రంగరించి... కార్యాచరణకు జోడించి ఎన్నికల ప్రచారలలో తమ సత్తా చాటుతున్నారు. రాజకీయంలో. విమర్శలు, ఎత్తిపొడుపులు సర్వసాధారణం. అందులోనూ ఎన్నికల సమయం వస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఇప్పుడిక జిహెచ్ఎంసి ఎన్నికల సమయం మొదలైంది.... అదేవిధంగా పార్టీల హడావిడి కూడా ఓ రేంజ్ లో ఉంది. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్  తనయుడు  కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. గత ఆరేళ్లుగా తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటూ... ఇప్పటికే తెలంగాణ ఎంతగానో అభివృద్ధిని సాధించిందని ఎంతో ఉన్నతమైన రాష్ట్రంగా పేరు పొందింది అని అన్నారు.

 ఈ ఆరేళ్లలో  ఎలాంటి వివాదాలు కానీ గొడవలు కానీ లేవని... ప్రజలు ఒకరికొకరు ఎంతగానో సహకరిస్తూ కలిసిమెలసి తోడుగా జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి క్షేమమే మొదటి లక్ష్యంగా ముందుకు వెళుతుందని తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరిగిందని.... ముఖ్యంగా కనీస వసతులు అందించడంలో విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. మంచినీళ్లు, కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని గతంలో కరెంట్ ఉంటే వార్త, నేడు అది పోతే వార్త అయిందని ఆయన  ఈ సందర్భంగా వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గుడుంబా గబ్బు లేదు, పేకాట క్లబ్ లు లేవు పోకిరీల ఆకతాయి పనులు లేవు అని పేర్కొన్నారు. సున్నం చెరువును బాగు చేసుకుంటున్నాము జీవో 58, 59 ద్వారా భూ యాజమాన్య పట్టాలు ఇస్తున్నాము అని అయన తెలిపారు.

ఐదు లక్షల సి సి కెమెరాలు పెట్టుకున్నామన్న ఆయన వాటిని పది లక్షలకు పెంచుతామని అన్నారు. ప్రతి సామాన్యుడికి సొంతింటి కలను నిజం చేయడం మా బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ల బయలుదేరారని, తాగి బండి నడపండి, చలాన్ లను బల్దియా కడుతాది అంటున్నారని అన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడా అని ఆయన ప్రత్యర్థుల ప్రస్తావన తీయకుండానే విమర్శిస్తూ  ప్రశ్నించారు. వరద సాయం ఆపి వారు వస్తే 25 వేలు ఇస్తామంటున్నారని ఆయన విమర్శించారు. మేము చేసిన వంద పనులు చూపిస్తా...కేంద్రం నగరంలో చేసిన ఒక్క పనిని చూపిస్తారా కిషన్ రెడ్డి అని ఆయన ఛాలెంజ్ గా మాట్లాడారు. చార్మినార్ వద్ద ఉద్దేశపూర్వకంగానే ధర్నా చేశారని, హిందువులకు ముస్లిములకు మధ్య వివాదాలు సృష్టించడానికి  చూస్తున్నారని వ్యక్తం చేశారు.  ఎలాంటి హైదరాబాద్ కావాలో మీరే ఆలోచించండి అని ఆయన అన్నారు. హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ ఆగమైతదన్న ఆయన ఇప్పుడు నగరం బాగుంది కాబట్టే గూగుల్,ఆపిల్ వచ్చాయి. గొడవలు ఉంటే అవి రావని అన్నారు. అభివృద్ధి కావాలా....అరాచకం కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: