చైనా రెచ్చిపోతూనే ఉంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు పెంచుతోంది. దీంతో చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జపాన్‌, ఆస్ట్రేలియాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకొని.. డ్రాగన్‌కు చెక్‌ పెట్టడానికి ప్రయత్నిస్తోంది.

చైనా దొంగనాటకాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది. దాదాపు మూడు వేల మందిని ఈ గ్రామాలకు తరలించింది. భారత్‌, చైనా, భూటాన్ దేశాల.. ట్రై జంక్షన్‌లో అరుణాచ‌ల్ ప్రదేశ్‌కు ప‌శ్చిమాన ఉన్న బ‌మ్ లా పాస్‌కు 5 కిలోమీట‌ర్ల దూరంలోనే ఈ గ్రామాల ను నిర్మించింది. డోక్లామ్ సైనిక ఘర్షణ జరిగిన స్థలానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే.. చైనా ఈ గ్రామాలను నిర్మించింది.  2017లో భారత, చైనా దేశాల మధ్య డోక్లామ్ ఘర్షణ చాలా రోజులపాటు జరిగింది. ఇటీవల లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద ఉభయ దేశాల మధ్య ఎనిమిది దఫాలుగా చర్చలు జరిగినా ఉద్రిక్తతలు తగ్గలేదు.

సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చైనా యాప్స్‌ను నిషేధించడంతో పాటు డ్రాగన్‌ వస్తువుల వాడకం తగ్గేలా చర్యలు తీసుకుంటోంది. దాంతోపాటు అంతర్జాతీయంగా చైనా వ్యతిరేక కూటమికి ప్రయత్నిస్తోంది. తాజాగా జపాన్‌, ఆస్ట్రేలియాతో త్రైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. ఈ 3 దేశాలు చైనాతో వాణిజ్యాన్ని  తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాపై వ్యతిరేకత ఉన్న దేశాలకు కూడా సహకరించాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఆస్ట్రేలియాలతో వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనను తొలుత జపాన్‌ తీసుకొచ్చింది. చైనా మీద ఆధారపడటం తగ్గించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది. మొత్తానికి చైనా తన వక్రబుద్దిని మార్చుకోవడం లేదు. కుక్కతోక వంకర అనేలా ప్రవర్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: