ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలపై బాగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. గత నెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలు 30 లక్షల మందిక వరకూ అందజేశారు. అలా అందజేసిన కొన్ని స్థలాల్లో ఇళ్లు కూడా కట్టిస్తున్నారు. అయితే .. అలా కట్టిస్తున్న ఇళ్లలో కొన్ని చాలా స్పీడుగా నిర్మాణం జరుగుతున్నాయి. ఇక గుంటూరు జిల్లాలో ఒక చోట అయితే ఏకంగా కేవలం 24 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించారు.

ఆ విశేషాలు తెలుసుకుందామా.. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల పథకంలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో మొదటి ఇల్లు పూర్తయింది. ఈ గ్రామానికి చెందిన లబ్ధిదారు నరాల రత్నకుమారి రాష్ట్రంలోనే మొదటి ఇల్లు కట్టుకున్నారు. ఈమె రెండో కేటగిరీ కింద ఇంటిని నిర్మించుకున్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె రెండో ఆప్షన్ ఎంచుకున్నారు.

ఈ రెండో విధానం ప్రకారం ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందజేస్తుంది. నిర్మాణానికి కావలసిన సామగ్రిని మాత్రం లబ్ధిదారే సమకూర్చుకోవాలి. రత్నకుమారి ఈ పద్దతిలోనే చకచకా ఇల్లు కట్టించుకున్నారు. ఈ గృహాన్ని ఆదివారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రారంభించారు.

రికార్డు స్థాయిలో ఈ ఇంటిని 24 రోజుల్లోనే నిర్మించుకున్నట్టు ఇంటి యజమాని రత్నకుమారి తెలిపారు. గత నెల 25న అధికారులు ఇంటి పట్టా అందజేశారట. 24 రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి అయ్యేందుకు అధికారులు బాగా సహకరించారని రత్న కుమారి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముకు మరో లక్ష 20వేల రూపాయలు సొంత డబ్బు కలుపుకుని మొత్తం 3 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఇల్లు నిర్మించుకున్నారట రత్నకుమారి.  ప్రభుత్వ సాయంతోపాటు తమ వ్యయం కలిపి మొత్తం రూ.3 లక్షలైంది. ఇలా రెండో కేటగిరీ కింద రాష్ట్రంలోనే మొదటిగా  కట్టి ఇల్లు రత్నకుమారిదేనని అధికారులు ధ్రువీకరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: