తిరుపతిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని లక్ష్యంగా మిగిలిన పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటే.. భారతీయ అధికార పార్టీ బీజేపి మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది.అందుకు కారణం కూడా లేకపోలేదు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు చూపడం భారతీయ జనతాపార్టీ పట్ల వ్యతిరేకతకు దారితీసింది. అసలే ఏపీలో అంతంత మాత్రమే ఉన్న ఆ పార్టీకి ఉక్కు ప్రైవేటీకరణ పర్యవసానాలు మరింత నష్టాన్ని కలిగించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడైన నేపథ్యంలో, తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికకు కూడా ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.


అయితే, తిరుపతిలో పోటీ చేసేందుకు బీజేపీ ముందు చూపినంత ఆసక్తి ఇప్పుడు చూపడం లేదని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. విశాఖ సొంత హక్కు అయిన ఉక్కు ప్రైవేటీకరణ పై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రులు రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర బీజేపి నేతలు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటి పరిస్థితుల్లో మిత్రపక్షమైన జనసేనకు తిరుపతి సీటు అప్పగించడం శ్రేయస్కరమని బీజేపీ శ్రేణులు వివరించినట్లు తెలుస్తోంది. పైగా ఐదు బలిజ సంఘాలు చంద్రగిరిలో సమావేశమై, తిరుపతి ఎంపీ సీటును జనసేనకు కేటాయించాలని, ఒకవేళ వారికి ఇవ్వకుంటే తమ సామాజికవర్గం నోటాకు ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు.


ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సాహసం చేయడం కన్నా కూడా జనసేనకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల స్వామి కార్యం, స్వకార్యం రెండు జరుగుతాయని భావిస్తున్నారు.ఓటమి తప్పని సీటును పట్టుకొని వేలాడడంకంటే ఆ సీటు వదులుకొని జనసేనకు అప్పగిస్తే అన్ని విధాలుగా ఉపయోగమని పలువురు బీజేపీ నేతలు వివరిస్తున్నారు. 'పవన్‌' సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది, భవిష్యత్‌లో తమ పోటీ మరోలా ఉండేదని చెప్పుకునే అవకాశం ఉంటుందని బీజేపీ జిల్లా నాయకత్వం కూడా వివరించినట్లు తెలుస్తోంది. తిరుపతి సీటు విషయమై గతంకంటే కాస్త భిన్న ఆలోచనతో ఉన్నారు. మరో వైపు జనసేనీకులు కూడా తిరుపతి బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: