రాష్ట్రంలో మొదటి విడత 15.60 లక్షల ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం, ఈ నెల 31లోగా జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా అత్యవసరంగా 8,316 చోట్ల నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయించడంతోపాటు పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. తూర్పుగోదావరిలో 753, ప్రకాశం జిల్లాలో 432, కర్నూలు జిల్లాలో 501.. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 8,316 చోట్ల బోర్లు వేయబోతున్నారు. ఈ పనులన్నిటినీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ నీటి పనుల విభాగం, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ఇంటి నిర్మాణాలలో పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలోగా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. లబ్ధిదారుల అవగాహన కోసం ప్రతి కాలనీలో మోడల్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ మోడల్ హౌస్ ని చూసి లబ్ధిదారులు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చెబుతున్నారు. నిర్మాణాల పనులు ఆలస్యం కాకుండా నీటి వసతికి ఇబ్బంది లేకుండా బోర్ల తవ్వకం మొదలు పెట్టారు. కాలనీలు ఏర్పడే లోగా.. ఇంటింటికీ మంచినీటి వసతి కల్పించబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి