
భారతదేశంలో కరోనా వ్యాప్తి కట్టడి విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు చేసి ప్రజలకు నరకం చూపించారని.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో హఠాత్తుగా లాక్ డౌన్ విధించి ఎందరో కార్మికుల మరణానికి కారణం అయ్యారని చాలామంది తిట్టిపోస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
"ప్రధాని నరేంద్ర మోడీ అర్జున్ రెడ్డి మాదిరి గడ్డం పెంచుతూ కెమెరాలకి హీరోల మాదిరి ఫోజులిస్తూ తన జీవితాన్ని బిందాస్ గా కొనసాగిస్తున్నారు. కానీ ఆయన పాలనలో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు మాత్రం రోడ్డు పాలయ్యాయి. 136 కోట్ల ప్రజలకు నాయకుడంటే ఎలా ఉండాలి? ఏదైనా విపత్తు సంభవిస్తే.. అది మళ్లీ పునరావృతం కాకుండా దూరదృష్టితో ఓ ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం చర్యలు చేపట్టి ప్రజలందరినీ సరైన మార్గంలో నడిపించాలి. కానీ మోడీ ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడంలో తప్ప ప్రజల జీవితాలను సంరక్షించే విషయంపై ఆలోచించిన పాపాన పోలేదు. గతంలో మోడీని ఎంతగానో పొగిడిన అంతర్జాతీయ మీడియానే ఈ రోజున మోడీని ఏకిపారేస్తున్నాయి. దీన్నిబట్టి మోడీలో నాయకత్వ లక్షణాలు అన్నీ పోయాయి. ఇప్పటికైనా హుందాగా రిజైన్ చేసి సమర్థవంతుడైన నాయకుడికి తన పదవిని అప్పగిస్తే బాగుంటుంది" అని సోషల్ మీడియా వేదికగా ఎందరో ప్రజలు మోడీ పరిపాలన పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే మోస్ట్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "అతను ( ప్రధాని మోడీ) పర్వతాలలో తిరిగే ఓ హిమాలయన్ బాబా లాగా కనిపిస్తున్నాడు. పర్వతాలలో తిరిగే హిమాలయన్ బాబా కాబట్టే వాస్తవ ప్రపంచంలో ఆక్సిజన్, పడకల విషయంలో ఏం జరుగుతుందనే దానిపై అతనికి ఏమీ తెలియడం లేదు. అతనికి ఏమీ తెలియదు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇలా( పొడవాటి గడ్డంతో) కనిపించే వ్యక్తి నాకు ప్రధాని గా ఉన్నందుకు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అందువల్ల, సార్, కనీసం గడ్డమైనా షేవ్ చేసుకోండి." అని రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.