
ఈ లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వెసులుబాటు ఉంటుంది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం కారణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటాయి. గత ఏడాది విధించిన లాక్‌డౌన్ కారణంగా అప్పుల పాలైన మధ్య తరగతి కుటుంబాలు ఇప్పటికీ ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేదు. ఇంతలోనే మరో సారి లాక్‌డౌన్ రావడం వారిని కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో వేల మంది ఉపాధిని కోల్పోయారు. వారికి ఇప్పటికే రోజు గడవడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్ వారిని మరింత దిగజార్చనుంది. అంతేకాకుండా ఈ లాక్‌డౌన్ కారణంగా మరింత మంది తమతమ ఉపాధిని కోల్పోయే అవకాశాలు లేకపోలేదు.
ఇక వలస కార్మికులు, రోజు కూలీల పరిస్థితి మరింత దుర్భరం కానున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని రోజు కూలీలు ఇల్లు గడవక, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వలస కార్మికుల పరిస్థితి అదే విధంగా తయారవుతుంది. చేసేందుకు పని లేక, తమ సొంత ప్రదేశాలకు వెళ్లేందుకు వెసులు బాటులేక ఇబ్బంది పడతారు. అంతేకాకుండా అద్దె ఇళ్లలో ఉండే వారికి ప్రతి నెల ఆ అద్దె కట్టడం గగనం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుడి కష్టాలు ఎన్నో వస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం ఏ దారి చూపిస్తుందో వేచి చూడాలి.