కరోనా తొలి దశ సమయంలో ఎంతో మంది జనాలు తమ గ్రామాలకు దూరంగా పంట పొలాల్లోనే తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకొని, అక్కడే బస చేసిన పరిస్థితులను చూశాము. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఓ గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు వారి తల్లులకు కరోనా సోకడంతో వాళ్లని ఇంట్లోనే వదిలి పెట్టి తాము మాత్రం పొలాల వద్దకు వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రము వరంగల్ రూరల్ జిల్లా లోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బోయిన వెంకటలక్ష్మి అనే మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమెను, వారి కుటుంబ సభ్యులను ఇంట్లో నుంచి బయటకు రావద్దు అంటూ గ్రామస్తులు వారి కుటుంబానికి గట్టిగా చెప్పారు.

గ్రామంలోని మిగిలిన వారికి కూడా ఆమె కుటుంబ సభ్యుల నుండి కరోనా సోకుతుందేమో అన్న భయంతో వారు బయటకు రావొద్దు అంటూ కట్టడి చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆమె తన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. అయితే ఇల్లు మరీ చిన్నది కావడం వలన తగిన వసతులు లేకపోవడంతో ఆమె కుమారుడు రాజ్ కుమార్ ఆయన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొని వారి పొలం దగ్గరికి వెళ్లి పోయారు. వారి ట్రాక్టర్ ను నివాసంగా మార్చుకుని జీవిస్తున్నారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన మరో మహిళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. బుస్సా సారమ్మ అనే మహిళకు కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లో నుంచి తన కుమారుడు ఎల్ల స్వామి, అతని భార్య ఇద్దరు పిల్లలతో కలిసి మామిడి తోటలో నివసిస్తున్నారు.

అయితే వర్ధన్నపేట లో క్వారంటైన్ కేంద్రం ఉన్నప్పటికీ వీరికి ఆ విషయం తెలియదట. ఇలా కరోనా కారణంగా సంతోషంగా కలిసున్న కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్ళిపోతున్నారు.ఈ గ్రామ సర్పంచ్ ఈ విషయాలపై ద్రుష్టి సారించి వారిని క్వారంటైన్ కు తరలించాలని ఇది తెలిసిన వారు అంటున్నారు. ఏదేమైనా ఈ కరోనా మహమ్మారి కారణంగా అయినవాళ్లు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: