పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం.....తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ పార్టీకి తిరుగులేని బలం ఉంది. అందుకే టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు పసుపు జెండా ఎగిరింది. ఆరు సార్లు చింతలపూడిలో టీడీపీ గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే 2019 ఎన్నికల నుంచి ఇక్కడ సీన్ మారిపోయింది. నియోజకవర్గంలో టీడీపీ వీక్ అయిపోయింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుపై వైసీపీ అభ్యర్ధి ఎలిజా విజయం సాధించారు.


అయితే ఓడిపోయాక రాజారావు చింతలపూడిలో పార్టీని పెద్దగా బలోపేతం చేయలేకపోయారు. ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యే వీక్‌గా ఉన్న సరే టీడీపీ పుంజుకోలేదు. ఇక హఠాత్తుగా రాజారావు ఈ మధ్య అనారోగ్యంతో మరణించారు. రాజారావు మరణించడంతో టీడీపీలో మాజీ మంత్రి పీతల సుజాత యాక్టివ్ అయ్యారు. సుజాత 2014లో టీడీపీ తరుపున చింతలపూడి నుంచి గెలిచారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.


కానీ పనితీరు బాగోకపోవడంతో అనూహ్యంగా మధ్యలోనే సుజాతని కేబినెట్ నుంచి తప్పించారు. ఇక ఎమ్మెల్యేగా సుజాత కొంతకాలం నడిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి చంద్రబాబు, సుజాతకు టిక్కెట్ ఇవ్వకుండా పక్కనబెట్టేశారు. కర్రా రాజారావుని తీసుకొచ్చి చింతలపూడిలో నిలబెట్టారు. అయితే జగన్ వేవ్‌లో రాజారావు ఓడిపోయారు. తాజాగా ఆయన మరణించడంతో నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పీతల సుజాత ప్రయత్నిస్తున్నారు.


మొన్నటివరకు పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించని సుజాత, రాజారావు మరణంతో బయటకొచ్చారు. నియోజకవర్గంలో కేడర్‌ని ఏకం చేసే పనిలో పడ్డారు. అలాగే మీడియా సమావేశాలు పెడుతూ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు దృష్టిలో పడటానికి గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో చింతలపూడిలో సుజాతకే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో చింతలపూడి టీడీపీ టిక్కెట్ సుజాతకే దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తానికైతే టిక్కెట్ కోసం ఈ మాజీ మంత్రి మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: