వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. ఇప్పటి వరకూ వివిధ నిరసన కార్యక్రమాల ద్వారా తెలంగాణలో ప్రజల్లోకి వెళ్లారు. పాదయాత్రలు, పరామర్శ యాత్రలు బాగానే చేశారు. ఇలాంటి పరామర్శ యాత్రలతో ఏమైనా ప్రయోజనం ఉందా, అసలింతవరకూ నాయకులు, కార్యకర్తలతో వైఎస్సార్టీపీ బలం పుంజుకుందా అంటే అనుమానమే. అందుకే ఆమె సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు రంగారెడ్డి జిల్లా చేవెళ్లనుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. అయితే అసలు షర్మిల పాదయాత్రకు ఇది సరైన సమయమేనా..? ఇప్పటికిప్పుడు యాత్ర చేపట్టడం వల్ల షర్మిలకు వచ్చే ఉపయోగం ఏంటి..? అనే ప్రశ్నలు సగటు వైఎస్సార్టీపీ అభిమానుల్ని కలవరపెడుతున్నాయి.

ప్రస్తుతం రాజకీయమంతా హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతోంది. ఈనెలాఖరు వరకు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందడితోనే మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ దశలో షర్మిల యాత్రలకు కవరేజ్ ఇచ్చేది ఎవరు..? కేవలం సోషల్ మీడియాని నమ్ముకుని షర్మిల యాత్రలు చేస్తే ఏం లాభం..? హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత షర్మిల యాత్ర మొదలు పెడితే బాగుండేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.

గతంలో లాగా కేసీఆర్ ఈ దఫా ముందస్తుకి వెళ్లే అవకాశం లేదు. కేసీఆర్ ముందస్తుకి వెళ్లను అని కరాఖండిగా చెప్పేశారు. అయితే రేవంత్ రెడ్డి వంటి ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం కేసీఆర్ ముందస్తుకి వెళ్తారని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు పెట్టుకోవాల్సిన పాదయాత్రను షర్మిల ఇంత ముందుగా మొదలు పెట్టడం ఎంతవరకు లాభసాటి అనేది తేల్చుకోవాల్సి ఉంది.

పాదయాత్ర వల్ల ఉపయోగాలు ఏంటనేది.. ఆల్రడీ వైఎస్ఆర్ నిరూపించారు, జగన్ దాన్ని బలపరిచారు. ఇప్పుడు అదే కుటుంబాన్నుంచి వస్తున్న షర్మిల కూడా పాదయాత్రతోనే రాజకీయాలు మొదలు పెడతానంటున్నారు. మరి ఆ సెంటిమెంట్ అనుకూలిస్తే యాత్రలతో షర్మిలకు కాస్తో కూస్తో లాభం ఉంటుంది. లేకపోతే నాన్ లోకల్ పార్టీ అంటూ షర్మిలను అందరూ పక్కనపెట్టేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: