- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

వచ్చే ఏడాది సంక్రాంతి 2026 బాక్సాఫీస్ వద్ద పెను సంచలనానికి వేదిక కాబోతోంది. టాలీవుడ్ అగ్ర హీరోలు పోటీ పడుతున్న ఈ సీజన్‌లో థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వంటి భారీ చిత్రాలతో పాటు, మాస్ మహారాజా రవితేజ, శర్వానంద్ వంటి హీరోలు కూడా పందెం కోళ్లుగా బరిలోకి దిగుతున్నారు. మామూలుగా రవితేజ అంటే మాస్, యాక్షన్, హై ఓల్టేజ్ డైలాగులు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి సంక్రాంతికి ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు.


సినిమా రవితేజ కెరీర్‌లో ఒక విభిన్నమైన ప్రయత్నంగా నిలవనుంది. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వంటి క్లీన్ సినిమాలను తీసే కిషోర్ తిరుమల, మాస్ రాజాతో ఎలాంటి మేజిక్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి రేసులో పోటీ విపరీతంగా ఉండటంతో, మేకర్స్ ఒక వినూత్నమైన స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచడం సర్వసాధారణం. కానీ, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని ఎలాంటి రేట్ల పెంపు లేకుండా సాధారణ ధరలకే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.


పండుగ పూట కుటుంబ సమేతంగా సినిమాకు వచ్చే ప్రేక్షకులకు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ల సినిమాలు భారీ బడ్జెట్‌తో వస్తున్నాయి కాబట్టి, వాటి టికెట్ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో రవితేజ సినిమా సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉంటే, ఫ్యామిలీ ఆడియన్స్సినిమా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క నిర్ణయంతో రవితేజ సినిమా మిగతా చిత్రాల కంటే ఒక అడుగు ముందుందని చెప్పవచ్చు. మొత్తానికి, ఈ సంక్రాంతికి మాస్ రాజా తన మార్కు వినోదంతో పాటు, ఈ సరికొత్త టికెట్ రేట్ల వ్యూహంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: