హుజురాబాద్‌ ఉపఎన్నికలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌ గుబులు పట్టుకుంది. ఎందుకంటే- కారు గుర్తులా కనిపించేలా చపాతీ రోలర్‌ గుర్తు ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు ఉండటమే. దుబ్బాక ఉపఎన్నికలో చోటుచేసుకున్న పరిణామమే హుజురాబాద్‌ ఉపఎన్నిక ఫలితంలోనూ పునరావృతమైతే అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఓటమికి సిలివేరు శ్రీకాంతే కారణమవుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

హుజురాబాద్ ఉపఎన్నికను అధికార టీఆర్ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, గులాబీ బాస్‌ కేసీఆర్‌... హుజురాబాద్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించాలని ఉపఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈటల రాజేందర్‌ మాట అటుంచితే.. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు ఎన్నికల సంఘం కేటాయించిన చపాతి రోలర్‌ (రోలింగ్‌ పిన్‌) గుర్తు తెగ టెన్షన్‌ పెడుతోంది. ఎందుకంటే దుబ్బాక ఉపఎన్నికలో 594 ఓట్లు సిలివేరు శ్రీకాంత్‌కు వచ్చాయి. కేవలం కారు గుర్తును పోలిన చపాతి రోలర్‌ చిహ్నమే ఆయనకు అన్ని ఓట్లు రావడానికి కారణమన్న చర్చ అప్పట్లో జోరుగా జరిగింది. దీంతో ఇప్పుడు హుజురాబాద్‌ ఉపఎన్నికలో కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుందేమోనన్న భయాందోళన గులాబీదళంలో గుబులు రేపుతోంది.

సిలివేరు శ్రీకాంత్‌ స్వస్థలం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట. ఈయన గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగాను, ఒకసారి ఎంపీ అభ్యర్థిగా సైతం పోటీ చేశారు. విశేషమంటే.. ఆ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయకుండానే శ్రీకాంత్‌కు ఓట్లు రావడం! ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈయనకు ఆరవది. 2018లో జరిగిన ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభ స్థానానికి పోటీ కోసం నామినేషన్ వేశారు. అయితే అప్పుడు చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలిగారు. కాగా, 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 6,800 ఓట్లు రాబట్టారు. 2019లో హుజూర్‌నగర్ బైపోల్‌లో 584 ఓట్లు వచ్చాయి. అలాగే 2020లో దుబ్బాక ఉపఎన్నికలో 594 ఓట్లు దక్కాయి. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ బైపోల్‌లో 55 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం హుజురాబాద్‌లో ప్రజా ఏక్తా అనే పార్టీ నుంచి బరిలోకి దిగిన సిలివేరు శ్రీకాంత్‌.. ఎన్నికల సంఘానికి విన్నవించుకుని మరీ టీఆర్ఎస్ కారు చిహ్నంకు దగ్గరగా ఉన్న రోలింగ్ పిన్ (రొట్టెల పీట, కర్ర) సింబల్‌ను పొందారు.

మొత్తంమీ కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా భావిస్తున్న హుజురాబాద్‌ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్‌ కారు గుర్తును పోలిన సిలివేరు శ్రీకాంత్‌ చపాతీ రోలర్‌ గుర్తుకు ఈసారి ఎన్ని ఓట్లు పడతాయి? అవి గులాబీ పార్టీ గెలుపోటములకు దారితీస్తాయా? అనే ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: