ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు ప్రస్తుతానికి తాత్కాలిక బ్రేక్ పడింది. 2019 అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రూపొందిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమే అని... మరోసారి సమగ్ర బిల్లును తయారు చేస్తామన్నారు వైఎస్ జగన్. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయానికి ప్రధానంగా ఆ మూడు అంశాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటన చేసి దాదాపు రెండేళ్లు పూర్తైంది. అయితే ఇప్పటి వరకు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. న్యాయ పరమైన చిక్కుల కారణంగా మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ పడిందని... త్వరలోనే ప్రభుత్వ పరిపాలన విశాఖ నుంచి ప్రారంభం అవుతుందని మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ వారం రోజుల క్రితం కూడా బల్ల గుద్ది మరీ చెప్పారు.

ప్రభుత్వం ప్రకటన వచ్చిన నాటి నుంచి రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 700 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలను దాటుకుని నెల్లూరు జిల్లాకు చేరుకుంది కూడా. అటు ఈ నెల 15వ తేదీన రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతుల పాదయాత్రకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే అమరావతి మాత్రమే రాజధాని అని.. ఇందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు కూడా. ఇక ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారింది రాష్ట్ర హైకోర్టు. సీఆర్‌డీయే చట్టం రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు చట్టాలకు గవర్నర్ ఆమోదం లభించినా కూడా... న్యాయస్థానంలో కేసులు అడ్డుగా మారాయి. వీటిపై రోజు వారి విచారణ చేపట్టిన హైకోర్టు... ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో జగన్ సర్కార్ యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: