తమిళనాడు రాజకీయం మరో కీలక మలుపు తీసుకుంటోంది. తాజాగా తమిళనాడులో అన్నాడీఎంకే అంతర్గత ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఇద్దరూ రాజీ పడ్డారు. వీరిద్దరూ కలిసి పోవడంతో, పార్టీని తన గుప్పిట్లోకి తీసుకోవాలన్న శశికళ ఆశలపై పూర్తి స్థాయిలో నీళ్లు చల్లినట్టయింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాగైనా పార్టీని హస్తగతం చేసుకోవాలని శశికళ భావించారు. అయితే అనూహ్యంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒకటి కావడంతో శశికళ డిఫెన్స్ లో పడిపోయారు. పళని, పన్నీర్ మధ్య కుదిరిన ఒప్పందంలో పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వంకు దక్కాయి. దీంతో ఇప్పుడు శశికళ ఏం చేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.

శశికళ ఇకపై అన్నాడీఎంకేలోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. అన్నా డీఎంకే లో జరుగుతున్న ఈ పరిణామాలపై శశికళ మండిపడుతున్నారు. పార్టీ రాజ్యాంగాన్ని పళనిస్వామి, పన్నీర్ సెల్వం మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దారులన్నీ మూసుకుపోవడంతో శశికళను దిక్కు తోచడం లేదు. ఈ పరిస్థితుల్లో శశికళను బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ దశలో శశికళ బీజేపీలో చేరతారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో బీజేపీ కోరిక మేరకే ఆమె కొత్త పార్టీ పెట్టడానికి పార్టీ నుంచి దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి బీజేపీలోకి వెళ్తారా, వెళ్లినా బీజేపీవాళ్లు రానిస్తారా..? అనేది ఆలోచించాల్సిన విషయమే..

శశికళను తగిలిన ఈ ఎదురుదెబ్బతో శశికళ వర్గం మొత్తం ఆగ్రహంతో ఉంది. పన్నీరుసెల్వం, పళనిస్వామిలను ఎదుర్కోవాలంటే ప్రస్తుతానికి శశికళను ఉన్న శక్తి సరిపోదు. దీంతో శశికళ వర్గంలో మెజారిటీ సభ్యులు బీజేపీలో చేరాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఇప్పుడిప్పుడే అన్నా డీఎంకే పార్టీని చేజిక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని సంకేతాలు కూడా రావడంతో శశికళ ఆలోచనలోపడ్డారని సమాచారం. అన్నా డీఎంకే పార్టీ చీఫ్ గా పన్నీర్ సెల్వం, డిప్యూటీ చీఫ్ గా పళనిస్వామి ఇకపై వ్యవహరించనుండటంతో శశికళ ఆటలు సాగేలా కనిపించడంలేదు. దీంతో ఇకపై శశికళ బీజేపీలో చేరడం మినహా, వేరే దారిలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: