వందేళ్లకోసారి మానవాళికి ఎదురయ్యే పెనుముప్పుగా చెప్పుకోదగ్గ కోవిడ్-19 వైరస్ పలు వేరియంట్ల రూపంలో ఇప్పటికీ ప్రపంచాన్నివణికిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు పలుదేశాలకు వ్యాపించి జనజీవనాన్ని అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి మరోసారి కోరలు చాస్తున్నట్టు వస్తున్నవార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే దీని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి బ్రిటన్ సహా పలు
యూరోపియన్ దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుండగా ఇది ఇతర దేశాలకూ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటిదాకా మరణాల సంఖ్య నమోదుకాలేదన్నలెక్కలకు
చెక్ పెడుతూ ఒక్క ఇంగ్లండ్ లోనే ఇది 12 మంది మరణానికి కారణమైనట్టు తాజాగా వస్తున్న వార్తలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అక్కడ 40 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఈ వేరియంట్ ఎంత తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్నదో తెలియజేస్తుంది. ఇక భారత్లో సైతం కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇవి 200 దాటినట్టు మంగళవారం
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అగ్రరాజ్యం
అమెరికా డెల్టా వేరియంట్ ధాటికి ఇప్పటికీ చివురుటాకులా వణుకుతూనే ఉండగా పులిమీద పుట్రలా అక్కడ ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాప్తిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ఉధృతిని నివారించేందుకు మరోసారి ప్రపంచవ్యాప్తంగా రాకపోకలపై ఆంక్షలు, లాక్డౌన్లు మొదలయ్యే అవకాశాలను ఏమాత్రం కొట్టిపారేయలేమని నిపుణులు చెపుతున్నారు. ఈ కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మరోసారి తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీనినే సూచిస్తూ సోమవారం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మనదేశానికి చెందిన బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 1200 పాయింట్లు కోల్పోయింది. కోవిడ్ కారణంగా మనదేశంలో విధించిన లాక్డౌన్లతో పలురంగాలు తీవ్రంగా నష్టపోయి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి ఉంది. మరోసారి అదే పరిస్థితి ఉత్పన్నమైతే కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందని, వైరస్ వ్యాప్తి నివారణకు అవసరమైన పటిష్టమైన చర్యలు తీసుకుని లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితలు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.