కొత్త సంవత్సరం వచ్చింది. కొంగొత్త ఆశలతో అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కానీ అనూహ్యంగా కరోనా భయాలు పెరిగిపోవడంతో కొత్త సంవత్సరం హడావిడి తగ్గింది. సందడి, సరదా అన్నీ అనుకున్న స్థాయిలో లేవు. పెద్ద పెద్ద పట్టణాలనుంచి, చిన్న చిన్న పల్లెటూళ్ల వరకు అన్ని చోట్లా జనం సంతోషంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు కానీ.. ఆ స్థాయిని మాత్రం అందుకోలేదు.

2022 నాటికి కరోనా పూర్తిగా తగ్గిపోతుందని, కొవిడ్ భయాలు లేకుండా అందరూ సంబరాలు చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ సరిగ్గా ఏడాది చివర్లో ఒమిక్రాన్ కలవరం అందరిలో గుబులు రేపింది. కొవిడ్ కేసులు పెరగడం, ఒమిక్రాన్ కేసులు కూడా పెరగడంతో ఎవరూ ఎక్కడా స్థిమితంగా ఉండలేకపోయారు. కేంద్రం కూడా భారమంతా రాష్ట్రాలపైనే వేసేసింది. దాదాపు అన్ని  రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. నైట్ కర్ఫ్యూలతొ మొదలై స్కూళ్లు, సినిమా థియేటర్లకు కూడా మూతపడింది. ఈ దశలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు ఎత్తేస్తారని ఎవరూ అనుకోలేదు. సరిగ్గా అదే జరిగింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు.. ఇలా దాదాపుగా సందడి తారా స్థాయిలో జరిగే అన్ని ప్రాంతాలు ఈసారి సైలెంట్ అయ్యాయి. ఎవరి ఇళ్లలో వారే, ఎవరి అపార్ట్ మెంట్లలో వారే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

గ్రామాల్లో పెరిగిన సందడి..
పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో సందడి పూర్తిగా తగ్గిపోగా.. గ్రామాల్లో మాత్రం ఈ సారి సందడి పెరిగింది. చిన్న చిన్న పల్లెటూళ్లలో కూడా ప్రతి ఇంట్లో కేక్ కట్ చేశారు. పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంకా ఒమిక్రాన్ భయం లేకపోయే సరికి అక్కడ సందడికి వచ్చిన లోటేమీ లేదు.

మొత్తమ్మీద 2022కి గొప్పగా స్వాగతం చెబుదామనుకున్న చాలామంది నిరాశపడ్డారు. వారం రోజుల ముందుగానే అన్ని ప్రాంతాల్లో కొత్త ఆంక్షలు రావడంతో ఎక్కడివారక్కడ సైలెంట్ అయ్యారు. కొత్త ఏడాది సందర్భంగా జరిగే న్యూ ఇయర్ బిజినెస్ కూడా ఈ సారి బాగా తగ్గిపోయినట్టు స్పష్టమైంది. నైట్ కర్ఫ్యూలు, పగటి పూట కూడా ఆంక్షలు ఉండటంతో.. వ్యాపారాలు కళ తప్పాయి. అయితే ఒమిక్రాన్ భయాలు తొందరగా తొలగిపోయి పరిస్థితి ప్రశాంతంగా మారిపోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: