వంట గ్యాస్ సిలిండర్.. ఓ కుటుంబానికి ఇది ఆయువు పట్టు లాంటిది. ఇంట్లో ఒకటే సిలిండర్ ఉండి.. ఉన్నట్టుండి వంట గ్యాస్ అయ్యిందంటే.. ఇక ఆ ఇంట్లో చుక్కలు కనిపిస్తాయి. సిలిండర్ బుక్ చేసుకుంటే వెంటనే రాదు.. కనీసం నాలుగైదు రోజులైనా పడుతుంది. ఇక అప్పుడు తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి.. ఎక్కడ సిలిండర్ ఉందో తెలుసుకుని నానా తిప్పలు పడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సమయానికి సిలిండర్ సాయం దక్కడం కూడా అంత సులభమైన విషయం కాదు.


కానీ.. ఇప్పడు ఆ తిప్పలు లేకుండా చేస్తోంది ఇండేన్ గ్యాస్ సంస్థ.. ఒకే సిలిండర్ ఉన్నవారు బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్ అందిస్తామంటోంది. అయితే ఇందుకు వినియోగదారుడు అదనంగా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ చుట్టపక్కల అయితే.. రూ. 25 రూపాయలు అదనంగా చెల్లిస్తే.. కేవలం రెండు గంటల్లోనే సిలిండర్ అందించే ఏర్పాటు చేస్తోంది ఇండేన్ సంస్థ.. సింగిల్ సిలిండర్ ఉన్న అనేక మందికి ఈ కొత్త నిబంధన వరంగా మారనుంది.


ఇలా గ్యాస్ కంపెనీలు కూడా అప్‌ డేట్ కావడం బావుంది. ఇప్పుడంతా స్పీడ్ కాలం.. స్మార్ట్ ఫోన్‌ నుంచి ఒక్క మెస్సేజ్‌ పెడితే అరగంటలో ఫుడ్ డెలివరీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే గ్యాస్ కంపెనీలు కూడా తమ పని తీరు మెరుగుపరుచుకుంటున్నాయి. అయితే ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థలు కాస్త మారేందుకు సమయం తీసుకుంటాయి. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా ఇదే బాటలో ఉన్నట్టు ఈ రెండు గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ నిబంధన చెబుతోంది.


ఇండేన్ గ్యాస్ సంస్థ తత్కాల్ సేవలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు రెండు గంటల్లో ఇంటికి సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. అయితే.. ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఐవీఆర్ఎస్ ద్వారా ఈ బుకింగ్ చేసుకోవచ్చు. లేదా సంస్థ వెబ్‌సైట్ ద్వారా కానీ...  ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఈ తత్కాల్ సేవకు వినియోగదారుల నుంచి రూ. 25 చార్జీలు వసూలు చేస్తారు. ప్రస్తుతానికి  హైదరాబాద్‌లో ఎంపిక చేయబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

gas