జిల్లాల విభజన కృష్ణా జిల్లాలో ఊహించని చిచ్చు రేపింది..అభివృద్ధి కోసం, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేసి ఉండొచ్చు..కానీ ఆ విభజన అసంపూర్తిగా ఉంటే మాత్రం జనం అంగీకరించరు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల ప్రజలు అదే చేస్తున్నారు. సరే కృష్ణా జిల్లాని మూడు జిల్లాలుగా విభజించారు. ఎలాగో జిల్లాలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి...వాటిని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు.

ఇటు ఏడు అసెంబ్లీ స్థానాలతో విజయవాడని ఎన్టీఆర్ జిల్లా చేయగా, ఏడు అసెంబ్లీ స్థానాలతో ఉన్న మచిలీపట్నంని కృష్ణా జిల్లాగా ఉంచేశారు. సరే వీటిల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఒకే జిల్లాగా ఉన్నప్పుడు జనం ఎలాంటి మార్పు కోరుకోలేదు. కానీ జిల్లాలుగా విడగొట్టాకే కొన్ని నియోజకవర్గాల ప్రజలు మార్పులు కోరుకుంటున్నారు. ఇప్పటికే నూజివీడు నియోజకవర్గం వాళ్ళు...తమని విజయవాడలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.


సరే నూజివీడు కాస్త దూరంగా ఉంటుంది కాబట్టి దాని గురించి పక్కనబెడితే...పెనమలూరు, గన్నవరం నియోజవర్గాలు పూర్తిగా విజయవాడ నగరంతో కలిసి ఉంటాయి..అలాంటప్పుడు తమని మచిలీపట్నం పరిధిలోకి ఎలా తీసుకెళ్తారంటూ ఆ రెండు స్థానాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా తమ స్థానాలని ఎలాగైనా విజయవాడలో కలిపేలా చూడాలని, ఆయా స్థానాల ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. గన్నవరంలో ఎలాగో వల్లభనేని వంశీ ఉన్నారు..ఇటు పెనమలూరులో పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇప్పుడు వారిపై చాలా ఒత్తిడి పెరుగుతుంది...ఒకవేళ వారు గాని తమ స్థానాలని విజయవాడ పరిధిలోకి తీసుకురాకపోతే జనమే చుక్కలు చూపించేలా ఉన్నారు. అదే సమయంలో కృష్ణా నది ప్రవహించే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని, ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉన్న జిల్లాకు కృష్ణా జిల్లా అని ఉంచడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా రాజకీయంగా ఆడుతున్న క్రీడ అని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జిల్లాల రగడ ఇంకా రగిలేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: