టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి, ఆయన పార్టీ ఎంపీ కేశినేని నానికి మధ్య పొసగడంలేదనే విషయం తెలిసిందే. ఆమధ్య చంద్రబాబుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నాని, ఒంగోలులో జరిగిన మహానాడుకి కూడా దూరంగానే ఉన్నారు. తన బదులు, తన తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తున్నారంటూ చాన్నాళ్లుగా నాని చంద్రబాబుపై అలిగారు. అయితే చంద్రబాబు కూడా ఆ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ వచ్చారు. నానిని నేరుగా ఎప్పుడూ ఆయన టార్గెట్ చేయలేదు. అదే సమయంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోకుండా అలాగే వదిలిపెట్టారు. తనకు తానుగా నాని, పార్టీనుంచి వెళ్లిపోయేలా చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కావడంలేదు. అదే సమయంలో నాని మాత్రం చంద్రబాబుని బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో టీడీపీ ఎంపీలంతా ఆయన్ను కలిశారు. పూల బొకే ఇచ్చేందుకు కేశినేని నానిని ఆహ్వానించగా ఆయన కాదు పొమ్మన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ చేతిని నెట్టివేశారు. దీంతో నాని, చంద్రబాబుని అవమానపరిచారంటూ కథనాలు ప్రసారం అయ్యాయి. ఆ సంగతి పక్కనపెడితే, తాజాగా సోషల్ మీడియాలో చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించేలా నాని కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది.

అసలు విషయం ఏంటి..?
కానీ నాని అది తానుకాదు అని చెబుతున్నారు. చంద్రబాబుని తానెప్పుడూ తిట్టలేదని, తిట్టాలని అనుకోలేదని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఉన్న కామెంట్లకు, తనకు సంబంధం లేదని చెబుతున్నారు నాని. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకి బొకే  ఇవ్వకుండా అవమానించిన నాని,  ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ కామెంట్లు పెట్టే ఉంటారని జనం నమ్ముతున్నారు, కానీ నాని కాదంటున్నారు.

ఎవరి పని..?
సోషల్ మీడియాలో తన పేరుతో చంద్రబాబుపై తప్పుడు కామెంట్లు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు నాని. ఈ తప్పుడు కామెంట్లని నాని కార్యాలయం ఖండించింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ కామెంట్లు, ఆ అకౌంట్ తనవి కాదంటున్నారాయన. ఈ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తనపేరిట నకిలీ ఖాతాలు సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. నకిలీ ఖాతాలనుంచి వెలువడే సమాచారం అధికారికం కాదని అంటున్నారాయన. మరి నకిలీ ఖాతాలు పెట్టి ఎవరైనా వారిద్దరి మధ్య గ్యాప్ పెంచాలని చూస్తున్నారా..? అసలేంటి కథ..? ముందు ముందు తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: