స్కిల్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుకు మద్దతుగా నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే  తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయాలని అనుకున్నారట. రాష్ట్రంలోని అన్నీ జిల్లాల కేంద్రాల్లోను బస్సుయాత్రలు చేసి చంద్రబాబుకు జనాల మద్దతును కూడగట్టాలన్నది ఆమె ఉద్దేశ్యంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రాజకీయంగా భువనేశ్వరి పెద్దగా యాక్టివ్ గా ఎక్కడా కనబడలేదు.





అయితే స్కామ్ లో చంద్రబాబు అరెస్టయి 22 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటం, కొడుకు లోకేష్ అరెస్టు భయంతో 15 రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయారు. దాంతో పార్టీని నడిపే వాళ్ళు కనబడలేదు. ఏదో తాత్కాలికంగా పొలిటికల్ యాక్షన్ కమిటి అనేదాన్ని వేసుకున్నా అదేమంత పెద్ద ప్రభావం చూపటంలేదు. ఎందుకంటే చంద్రబాబు తర్వాత అంతటి సమర్ధవంతంగా పార్టీని నడిపేవాళ్ళు ఎవరు అంటే ఎవరూ కనబడటంలేదు. ఇపుడు పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతోంది.





ఈ నేపధ్యంలోనే అత్తా, కోడళ్ళు, భువనేశ్వరి, బ్రాహ్మణి రంగంలోకి దిగారు. ఐటి ఉద్యోగులు, యువత లక్ష్యంగా బ్రాహ్మణి పావులు కదుపుతుంటే భువనేశ్వరి పార్టీలోని నేతలను కలుస్తున్నారు. అలాగే చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు చేస్తున్న వారిని పరామర్శిస్తున్నారు. చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చేంతవరకు యాక్టివ్ గా ఉండక తప్పదని భువనేశ్వరికి అర్ధమైనట్లుంది. అందుకనే ప్రతిరోజు నేతలతో మాట్లాడటమే కాకుండా మీడియా సమావేశాలు కూడా పెడుతున్నారు.





పనిలో పనిగా జిల్లాల కేంద్రాలు టచ్ చేసేలా బస్సుయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా జనాల మద్దతును కూడగట్టి వచ్చేఎన్నికల్లో ఘనవిజయం సాధించటంలో తనవంత పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారట. బహుశా బస్సుయాత్ర ఎప్పటినుండి మొదలుపెట్టాలనే విషయం  మొదటివారంలో ఫైనల్ అయిపోతుందని అంటున్నారు. మొదటివిడతలో కేవలం జిల్లాల కేంద్రాలను మాత్రమే టచ్ చేసేలా రూటుమ్యాపు రెడీ  చేస్తున్నారట. మరి బస్సులో ఎవరెవరు పాల్గొంటారు ? ఎన్నిరోజులుంటుంది అన్న విషయాలు ఇంకా ఫైనల్ కాలేదు. మొదటివారంలోగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: