ఎన్నికలకు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే ఒకే ఇంట్లో బహుళ పెన్షన్ల విధానాన్ని ప్రస్తావిస్తు దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం ఒకే ఇంట్లో  అనేక రకాల పెన్షన్లను అందిస్తున్నది కాబట్టి పెన్షన్ల మంజూరులో వ్యక్తులను యూనిట్ గా తీసుకోవాలని లాయర్ తాండవ యోగేష్ 2022లో పిటీషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కేసును కొట్టేసింది.





కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా వృద్ధాప్య, వింతతు, వికలాంగుల పెన్షన్లను ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెన్షన్లన్నింటినీ ప్రభుత్వాలు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటున్నాయి. దీన్నే లాయర్ చాలెంజ్ చేశారు. కుటుంబాన్ని కాకుండా వ్యక్తులను యూనిట్ గా తీసుకోవాలని పిటీషన్లో కోరారు. కుటుంబంలో వృద్ధులు ఎంతమంది ఉన్నా, వితంతువులు ఎంతమందున్నా ఒకరికి మాత్రమే పెన్షన్ అందటం అన్యాయమన్నది లాయర్ వాదన. పెన్షన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చలను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది.





పెన్షన్లన్నది ప్రభుత్వాల ఆర్ధిక పరిస్ధితిపైన ఆధారపడుంటుంది కాబట్టి విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోదని స్పష్టంగా హైకోర్టు తీర్పిచ్చింది. వివిధ పెన్షన్లకు కేంద్రప్రభుత్వం రు. 188.74 కోట్ల ఇస్తుంటే దానికి మాచింగ్ గ్రాంటుగా రాష్ట్రప్రభుత్వం రు. 19,161 కోట్లు ఇస్తోందన్న విషయాన్ని హైకోర్టు హైలైట్ చేసింది. పెన్షన్లన్నది సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు ఇస్తున్న విషయాన్ని లాయర్ కు గుర్తుచేసింది. అందుకనే ప్రభుత్వాలు తీసుకునే పాలసీ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని గతంలోనే సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాలను లాయర్ కు గుర్తుచేసింది.





నిజానికి ఎన్నికలకు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ కు పెద్ద రిలీఫనే చెప్పాలి. లాయర్ చెప్పినట్లుగా వ్యక్తులను యూనిట్ గా తీసుకోవాలని కోర్టు చెప్పుంటే ప్రభుత్వంపై ఆర్ధికభారం విపరీతంగా పెరిగిపోయేది. అప్పుడు పెన్షన్ల విధానాన్ని ప్రభుత్వం అమలుచేయలేక కుప్పకూలిపోయుండేదనటంలో సందేహంలేదు. దాంతో జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయేది.  మరి లాయర్ ఏమి ఆలోచించి ఈ పిటీషన్ వేశారో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: