మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వైఖరి గురించి బీజేపీ నేతలకు బాగా తెలుసు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి 2019 ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీపై చేసిన విమర్శలు అన్నీఇన్నీ కావు. జనసేన అధినేత పవన్ సైతం పాచిపోయిన లడ్డూలు అంటూ తీవ్రస్థాయిలో బీజేపీపై విమర్శలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి.
 
అయితే వేర్వేరు కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తుకు బీజేపీ అంగీకరించింది. పేరుకే పొత్తు కానీ బీజేపీ నేతలు టీడీపీ, జనసేనలతో సంబంధం లేకుండానే ఏపీలో పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నేత సిద్దార్థ నాథ్ మేనిఫెస్టో కాపీని కనీసం తాకనైనా తాకకపోవడం నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫోటో కూడా లేదంటే ఆ హామీలకు తమకు ఏ మాత్రం సంబంధం లేదని బీజేపీ వైపు నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ ఉంది.
 
బీజేపీకి ప్రత్యేక మేనిఫెస్టో ఉందని టీడీపీ జనసేన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని కొందరు బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లు సైతం సోషల్ మీడియాలో సంచలనం అవుతున్నాయి. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి పురంధేశ్వరి కానీ రాష్ట్ర బీజేపీ నేతలు కానీ హాజరు కాలేదంటే ఈ మేనిఫెస్టోపై వాళ్లలో ఎలాంటి అభిప్రాయం ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
 
పొత్తు టీడీపీ జనసేన మధ్య పొత్తు మాత్రమేనని బీజేపీ పేరు ఉన్నా ఆ పార్టీ ఏపీ రాజకీయాలకు సంబంధించి చూసీచూడనట్లుగా వ్యవహరించనుందని తెలుస్తోంది. 2014 సంవత్సరంలో బాబు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదు. జగన్ 2014 లో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో గురించి ప్రశ్నిస్తే టీడీపీ నేతల దగ్గర జవాబులు కూడా లేవు. ప్రస్తుతం బాబు ప్రకటించిన హామీలు అమలు సాధ్యం కాదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు క్లారిటీ ఉంది.
 
ఆ హామీలకు మద్దతు ఇస్తే తమ పరువు పోతుందని భావించిన బీజేపీ నేతలు ముందుజాగ్రత్త వహించారు. టీడీపీ నేతలకే బీజేపీలో టికెట్లు దక్కడం విషయంలో కూడా మోదీ, అమిత్ షా అసహనం వ్యక్తం చేశారని వార్తలు వినిపించాయి. పురంధేశ్వరి, చంద్రబాబు కుట్రల వల్ల నిజంగా బీజేపీ కోసం పని చేసిన నేతలకు టికెట్లు దక్కలేదు. చంద్రబాబు నైజం గురించి బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉందని మోదీ ముందు బాబు ఆటలు ఎప్పటికీ సాగవని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp