ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉండటం ఆ పార్టీకి ప్లస్ అవుతోంది. చీరాల నియోజకవర్గంలో వైసీపీ నుంచి కరణం వెంకటేశ్, టీడీపీ నుంచి మాలకొండయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.
 
అయితే ఆమంచి కృష్ణమోహన్ చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తీరుపై ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఇదే వ్యవహరిస్తే చీరాల డీఎస్పీని చెట్టుకు కట్టేసి బుద్ధి చెబుతామని ఆమంచి అన్నారు. బేతపూడి ప్రసాద్ ఎమ్మెల్యే కరణం బలరాం అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడంటూ ఆమంచి సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.
 
కఠారిపాలెంకు చెందిన కొన్ని మత్స్యకార కుటుంబాలు తనకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో డీఎస్పీ వాళ్ల ఇళ్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించి వాళ్లను భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమంచి వెల్లడించారు. ఎన్నికల పరిశీలకుడు పరిమళ సింగ్, పోలీస్ పరిశీలకుడు అయ్యప్పలకు ఆమంచి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
 
గతంలో కూడా ప్రసాద్ కరణం బలరాంకు అనుకూలంగా పని చేశారని ఆమంచి వెల్లడించారు. కఠారిపాలెం వాసులు తనకు సపోర్ట్ ఇస్తున్నారనే కారణంతో డీఎస్పీ వాళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆమంచి అన్నారు. ఆమంచి ఫిర్యాదు నేపథ్యంలో అధికారుల నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఆమంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. ఆమంచి ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసి ఉంటే  ఈ నియోజకవర్గంలో ఆమంచికి గెలుపు నల్లేరుపై నడక అయ్యేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: