- అప్పు అయితే తిరిగి క‌ట్టాల్సిందే.. గ్రాంట్ల‌తో ఆ బాధ ఉండ‌దు
- టీడీపీ + జ‌న‌సేన బ‌లం కీల‌కం కావ‌డంతో బాబు, ప‌వ‌న్ చ‌క్రం తిప్పాలి

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

కేంద్రం అప్పులు ఇస్తానంటోంది.. రాష్ట్రాలు గ్రాంటులు కోరుతున్నాయి. మ‌రి వీటిలో ఏది బెట‌ర్‌? అనే ప్ర‌శ్న వ‌స్తే.. గ్రాంటులు తీసుకోవ‌డం ఉత్తమం. గ్రాంటులు అయితే.. తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఈ దిశ‌గా ఏపీ వంటి రాష్ట్రాలే ముందుండాలి. ఒక‌వైపు బీహార్ కూడా.. ఇదే ప్ర‌తిపాద‌న‌కు రెడీ అవుతోంది. తాజాగా జ‌రిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. అప్పులు చేసుకోండి.. ఎంతైనా ఫ‌ర్వాలేదు.. అని ఉచిత స‌ల‌హా ఇచ్చారు.


కానీ, ఇప్ప‌టికే ఏపీ వంటి రాష్ట్రాలు.. అప్పుల కుప్ప‌లుగా మారిపోయాయి. దీంతో అప్పులు చేసుకుంటూ పోతే.. మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై భారం మోపాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో దాదాపు స‌గానికిపైగా రాష్ట్రాలు అప్పులు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అలాగ‌ని కేంద్రంపై ఒత్తిడి కూడా చేయ‌డం లేదు. ఎవ‌రి రాజ‌కీయ అవ‌స‌రాలు వారివి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యంలో బిహార్ కొంత వ‌ర‌కు ప‌ట్టుబ‌డుతోంది.


ఎందుకంటే.. కేంద్రంలో కూట‌మి స‌ర్కారుకు బిహార్ కూడా.. ద‌న్నుగా ఉంది. ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేనల బ‌లం కూడా.. కేంద్రానికి అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో అప్పులు కాదు.. మాకు గ్రాంట్లు ముఖ్యం అనే మాట‌ను వినిపించాల్సి ఉంది. ఈ విష‌యంలో ఎందుకో.. తాజాగా జ‌రిగిన కౌన్సిల్ భేటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ‌వ్ గ‌ళం స‌రిగా వినిపించ‌లేక పోయారు. అప్పులు ఇస్తాం.. 50 ఏళ్ల వ‌ర‌కు వ‌డ్డీలు కూడా.. వుండ‌బోవ‌ని కేంద్రం చెబితే.. ఆయ‌న మౌనం పాటించారు.


ఇదే స‌మ‌యంలో బీహార్ మాత్రం మాకు అప్పులు వ‌ద్దు.. అని తేల్చి చెప్పింది. అయితే.. గ్రాంట్ల ప్ర‌తిపా ద‌న‌ను మోడీ స‌ర్కారు 2020లోనే విర‌మించుకుంది. ఏదైనా స‌రే.. అప్పులు చేసుకోవాల్సందే అనే తీరుగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్రారంభించింది. అప్ప‌ట్లో బీజేపీ బ‌లంగా ఉంది కాబట్టి.. అలా వ్య‌వ‌హ‌రించారు. కానీ, ఇప్పుడు ఆధార‌ప‌డిన  ప్ర‌భుత్వం కావ‌డంతో ఏపీ ఎంపీలు.. బిహార్ వంటి క‌లిసి వ‌చ్చే ఎంపీల‌తో క‌లిసి.. కేంద్రంపై ఒత్తిడి పెంచితే..  గ్రాంట్ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నిస్తే.. వైసీపీ అప్పులు చేసింద‌న్న పేరు వ‌చ్చిన‌ట్టు..  టీడీపీ అప్పులు చేసింద‌న్న పేరు రాకుండా ఉండేందుకు అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: