
పథకాన్ని ప్రారంభించిన వెంటనే భారీ రద్దీ ఏర్పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొదటి మూడు నెలలు అధిక సంఖ్యలో మహిళలు ప్రయాణించే అవకాశం ఉందన్న అంచనాతో డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నారు. మగవారికి మామూలు టికెట్ ఇవ్వగా, మహిళలకు ప్రత్యేకంగా జీరో టికెట్లు ఇవ్వనున్నారు. భర్త భార్య కలిసి ప్రయాణిస్తే... భర్తకు చార్జీ ఉన్న టికెట్, భార్యకు జీరో టికెట్ వేర్వేరుగా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకత ఏంటంటే... ఈ పథకం ఏపీకి చెందిన మహిళలకే పరిమితం. ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రుజువు చేసినవారికే ఉచిత ప్రయాణ హక్కు ఉంటుంది. అంటే ఎలాంటి గందరగోళం లేకుండా బస్సులో మహిళ ఎవరో ముందే క్లియర్ చేసేందుకు ఆర్టీసీ చక్కటి ప్రణాళికను రూపొందించింది.
ఈ పథకం రాష్ట్రంలోని లక్షలాది పేద, మధ్య తరగతి మహిళలకు వరం లాంటి సేవ కానుంది. ఉద్యోగం, చదువు, కుటుంబ అవసరాల కోసం ప్రతిరోజూ ప్రయాణించే మహిళలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఇదిలా ఉంటే... గతంలో తెలంగాణలో అమలైన ‘మహిళల ఉచిత బస్సు ప్రయాణం’ పథకాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని మరింత విస్తృతంగా దీనిని ఏపీలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి... ఈ ఆగస్టు 15న మహిళలకు నిజమైన స్వాతంత్ర్య ప్రయాణం కానుంది. ఓ పల్లెటూరి అమ్మ నుంచి పట్టణానికి పనికెళ్లే యువతీ వరకు – బస్సులో ప్రతి సీటు వెనక ఓ నవ్వు కనిపించబోతోంది