రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థ ఈ నెల 15వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తిచేసుకోనుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ఎవరికీ ఊహించని విధంగా జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, కేవలం 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి, ఆగస్టు 15 నాటికి వలంటీర్ల నియామకం పూర్తిచేశారు. మొదట 6 లక్షల మందిని తీసుకోవాలన్న లక్ష్యంతో ప్రారంభించినా, చివరకు దానిని 4 లక్షల మందికి పరిమితం చేశారు. ఈ వ్యవస్థ అప్పట్లో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకతో పాటు పంజాబ్‌ ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఏపీకి వచ్చి వలంటీర్ వ్యవస్థపై అధ్యయనం చేశారు. తమ రాష్ట్రాల్లో అమలు చేయాలన్న ఆలోచన వచ్చినా, చివరకు దీర్ఘకాలిక రాజకీయ ప్రభావాలపై ఆందోళనతో ఆ ఆలోచనను మానేశారు. ప్రజలతో నేరుగా ప్రభుత్వ సంబంధం ఏర్పరిచే ఈ వ్యవస్థను వైసీపీ తన పరిపాలనలో ప్రధాన అస్త్రంగా భావించింది.


దీంతో ఏ పథకం అమలైనా, ఏ సహాయం అందించినా, అది ప్రజలకు వలంటీర్ల ద్వారానే చేరింది. ఫలితంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రాధాన్యం గణనీయంగా తగ్గింది. కొన్నిచోట్ల ప్రజలు తమ ఎమ్మెల్యేను పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. వలంటీర్ల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ప్రభుత్వానికే క్రెడిట్ ఇస్తుండటంతో, స్థానిక ప్రజాప్రతినిధులు పక్కన పడిపోయారు. ఈ వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ, వాటిని సరిచేయడంలో వైసీపీ పెద్దగా ఆసక్తి చూపలేదనే విమర్శలు వచ్చాయి. పార్టీకి, నేతలకూ అనుకూలం కాని పరిస్థితులు ఉన్నా, ప్రభుత్వం దీనిని కొనసాగించింది.
అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పరిస్థితి మారింది. గత 15 నెలలుగా వలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పక్కన పెడితే, వాస్తవానికి ప్రజలకు వలంటీర్లు అవసరమా? అనే చర్చ మళ్లీ మొదలైంది.


ప్రస్తుత పరిస్థితుల్లో, వలంటీర్లు లేకపోయినా పనులు సజావుగానే జరుగుతున్నాయని, ఎటువంటి అంతరాయం కలగలేదని ప్రభుత్వం చెబుతోంది. ఒకప్పుడు పాలనలో కీలక పాత్ర పోషించిన వలంటీర్ వ్యవస్థ, ఇప్పుడు మూతపడినట్టే అయింది. భవిష్యత్తులో వైసీపీ మళ్లీ వలంటీర్లను ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి ఉండదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక వెలుగు వెలిగిన ఈ వ్యవస్థ, ఇప్పుడు రాజకీయ చరిత్రలో ఒక చిన్న అధ్యాయంగా మిగిలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: