ఉపరాష్ట్రపతి ఎన్నికల చుట్టూ తెలంగాణలో బోలెడన్ని రాజకీయ గాలివానలు మొదలయ్యాయి. కాంగ్రెస్, ఎన్డీయే, ఇండియా కూటమి - ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నా … బీఆర్ఎస్ మాత్రం ఏ వైపు వెళ్లాలో తెలియని స్థితిలో ఉంది. ఈ అయోమయానికి కారణం ఒక్క కేటీయార్ వ్యాఖ్యలే. ఓ వైపు రైతులకు యూరియా సరఫరాలు తెస్తే మద్దతిస్తామని చెప్పడం, మరోవైపు “బీసీలకు అవకాశాలు ఇవ్వాలి, కంచె ఐలయ్య లాంటి వారిని పరిశీలించాలి” అని హఠాత్తుగా వ్యాఖ్యానించడం … ఇవన్నీ బీఆర్ఎస్ కేడర్‌లోనే గందరగోళం రేపాయి. యూరియాకి ఉపరాష్ట్రపతి ఎన్నికలకీ సంబంధం ఏమిటన్న అనుమానమే గాక, సమాజంలోనే వివాదాస్పదుడైన కంచె ఐలయ్య పేరును లాగడం కేటీఆర్ తప్పు పాయింట్ అయ్యింది.


తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన, స్థానికతకు ప్రతీకగా నిలిచే సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థి. అతనికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా… ఆయన కాంగ్రెస్ పార్టీ వాడేం కాదని అందరికీ తెలుసు. న్యాయవాది, ఉద్యమ మద్దతుదారు, స్వచ్ఛమైన ఇమేజ్ కలిగిన వ్యక్తి. మరోవైపు ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ తమిళనాడు వ్యక్తి. తెలంగాణ‌ vs త‌మిళ‌నాడు పోలికలో సుదర్శన్ రెడ్డికే ప్లస్ పాయింట్లు ఎక్కువ. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఓ తెలంగాణ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా, ఇంత అయోమయంగా వ్యవహరించడం ఆశ్చర్యమే.



కేడర్ లో గుసగుస — “మనం తెలంగాణ పార్టీ కదా, తెలంగాణ వ్యక్తిని ఎందుకు బహిరంగంగా సపోర్ట్ చేయకూడదు?” అని. పైగా కాంగ్రెస్ ప్రతిపాదన కాబట్టి మేము వద్దంటాం అనడం బలహీన వాదనగానే వినిపిస్తోంది. కాంగ్రెస్ చిన్న పార్టీ అన్న కేటీఆర్ కామెంట్ … అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన పక్షం కాబట్టి, దాన్ని తగ్గించిపెట్టడం తప్పు లెక్కే. మరింతగా, బీజేపీతో , బీఆర్ఎస్ ఒప్పందమా అన్న అనుమానం సమాజంలో పెరుగుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తే, “బీజేపీలో విలీనం ఖాయం” అన్న వాదనలకు బలం చేకూరుతుంది. పార్టీ మొదలైన స్పిరిట్‌కి, తెలంగాణ గౌరవానికి గీత వేసినట్టవుతుంది.



నిజానికి, కేటీఆర్ ఇలా గందరగోళం సృష్టించకుండా సింపుల్‌గా – “మేము ఎలాంటి కూటమికి చెందిన వాళ్లం కాదు, కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేస్తాం” అని చెప్పి ఉంటే బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ చెక్ పెట్టేవాడు. పార్టీకి హుందాతనం కూడా పెరిగేది. కానీ, మాటల్లో తడబాటు, పొలిటికల్ క్లారిటీ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ మళ్లీ ఒకసారి “మార్గం తప్పిన పార్టీ”గా కేడర్‌లో కూడా పేరు తెచ్చుకుంటోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా పట్టుకున్న కాంగ్రెస్కి ఇది మరింత లాభం అవుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: