
కేసీఆర్, హరీష్‌రావు ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి, కమిషన్ రిపోర్టు ముందుగా అసెంబ్లీలో చర్చించాల్సిందేనని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్ .. అయితే, ఈ విచారణలో హైకోర్టు ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా మీడియా సమావేశం నిర్వహించి, తరువాత 60 పేజీల రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వెంటనే ఆ రిపోర్టును అన్ని పబ్లిక్ ప్లాట్‌ఫార్ముల నుండి తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే కమిషన్ 8B, 8C నోటీసులు ఇవ్వకుండా పిటీషనర్లపై నేరుగా ఆరోపణలు చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వారాల్లో పూర్తి వివరణ తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది.
రానున్న రోజుల్లో రచ్చ ఖాయం .. ఈ పరిణామాలతో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చుట్టూ మళ్లీ రాజకీయ రచ్చ ఖాయమైంది. అసెంబ్లీలో చర్చకు రానున్న ఈ నివేదికలోని అంశాలు బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలకు దారితీయవచ్చు. కేసీఆర్, హరీష్ రావు పేర్లు స్పష్టంగా లింక్ అవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు రక్షణాత్మక వైఖరి అవలంబించే అవకాశం ఉంది. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి, హైకోర్టు తాజా ఆదేశాలు తెలంగాణ రాజకీయాలకు కొత్త మలుపు తీసుకువచ్చాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభావం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో హాట్ టాపిక్‌గా మారడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.