
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 29న జాతీయ క్రీడల దినోత్సవం కోసం విశాఖకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల ప్రోత్సాహకంగా చేపట్టిన కార్యక్రమాలకు విశాఖ వేదికగా ఉపయోగించుకుంటూ, క్రీడా సందేశం ఇవ్వనున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మాణం.. క్రీడా పాలసీపై కీలక ప్రకటన .. జిల్లాల స్థాయిలో నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు ఇవ్వడం వంటి అంశాలతో చంద్రబాబు విశాఖ పర్యటన పూర్తి భిన్నంగా ఉండబోతోంది. అధికార కార్యక్రమం కావడంతో రాష్ట్రం అంతటా క్రీడా రంగంపై ఆయన ఫోకస్ పెట్టబోతున్నారని అంటున్నారు.
అదే 30న విశాఖలో జనసేన ఉత్తరాంధ్ర మీట్ భారీ ఎత్తున జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావడానికి పవన్ కళ్యాణ్ ముందురోజే విశాఖ చేరుకుంటారు. ఇప్పటికే జనసేన నేతలు, క్యాడర్ ఈ మీట్ కోసం గ్రౌండ్ లెవెల్‌లో ఏర్పాట్లు మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడమే ఈ మీట్ ముఖ్య ఉద్దేశ్యం. పార్టీ క్యాడర్‌కు భరోసా ఇవ్వడం, అసంతృప్తులను తగ్గించడం, కో ఆర్డినేషన్ పెంచడం వంటి కీలక సూచనలు పవన్ అందించబోతున్నారని సమాచారం.
దీంతో ఒకవైపు చంద్రబాబు అధికార కార్యక్రమంలో బిజీగా ఉంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ వేదిక నుంచి క్యాడర్‌ను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తారు. ఇద్దరూ ఒకే రోజుల్లో విశాఖలో ఉండడం వల్ల రాజకీయ వాతావరణం రచ్చరచ్చగా మారడం ఖాయం. విశాఖ ఎప్పుడూ కూటమికి బలమైన కేంద్రంగా ఉండటంతో, ఇప్పుడు మళ్లీ ఈ నగరంపై నేతల దృష్టి సారించడం విశేషం. ఇక బాబు, పవన్ ల రాకతో విశాఖలో రెండు రోజులు రాజకీయ పండుగలా మారనున్నాయి. ప్రజా సమూహాలు, క్యాడర్ సందడి, భద్రతా ఏర్పాట్లు అన్నీ కలిపి నగరానికి హైటెన్షన్ వాతావరణం తీసుకురానున్నాయి. విశాఖలో కూటమి త్రిమూర్తుల హవా.. రాబోయే స్థానిక ఎన్నికలకు వార్మప్ అన్నట్లే కనిపిస్తోంది.