కుప్పం ప్రజల దీర్ఘకాల స్వప్నం చివరికి నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీళ్లు చేరాయి. శనివారం రాత్రి రామకుప్పం మండలం కొంగాటం గ్రామానికి నీళ్లు చేరుకోగా, ఆదివారం ఉదయం శాంతిపురం మండలం మఠం పంచాయతీకి చేరుకున్నాయి. ఈ జలహారతిని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు పాల్గొని నిర్వహించారు.


కుప్పం ప్రజల తాగునీటి, సాగునీటి సమస్యలు తీర్చడంలో భాగంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణమ్మను తేవడంలో చంద్రబాబు కృషి కీలకమని నాయకులు ప్రశంసించారు. గుండిశెట్టిపల్లె వద్ద జరిగిన కార్యక్రమంలో రైతులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు. “మాట ఇచ్చాను – నెరవేర్చాను” అని చంద్రబాబు స్పందన .. కుప్పానికి కృష్ణమ్మ చేరడంపై చంద్రబాబు భావోద్వేగంగా స్పందించారు. నాడు అసెంబ్లీలో “హంద్రీ–నీవా ద్వారా కుప్పానికి కృష్ణమ్మ పరుగులు తీయిస్తా” అని చేసిన హామీని ఇప్పుడు నిలబెట్టానని ఆయన గుర్తు చేశారు. ఆ సందర్భంగా చేసిన తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.



ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ, “కుప్పం ప్రజలకు ఇక నీటి కష్టం ఉండదు. చంద్రబాబు మాట నిలబెట్టిన నాయకుడు. అపర భగీరథుడిలా ఆయన ఈ చరిత్ర సృష్టించారు. గతంలో జగన్ కేవలం సినిమా సెట్ వేసి నాటకం ఆడారు. కానీ, చంద్రబాబు మాత్రం చేసి చూపించారు” అన్నారు. ఈ నెల 30న పరమసముద్రం చెరువుకు చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారని తెలిపారు. ఆ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని చెప్పారు. మొదట నవంబర్ నాటికి కుప్పానికి నీళ్లు తరలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ మూడు నెలల ముందుగానే ఆ హామీని నెరవేర్చడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. సంవత్సరాలుగా ఎండిపోయిన చెరువులు నిండిపోతాయని, భూగర్భ జలాలు పుష్కలంగా పెరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



కుప్పం నియోజకవర్గంలో మొత్తం 554 చెరువులు ఉన్నాయి. వర్షాభావం వల్ల వీటిలో చాలా చెరువులు ఎండిపోయాయి. గుడుపల్లెలో 1,300 అడుగుల లోతుకు బావులు త్రవ్వినా నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కర్ణాటక సరిహద్దుల్లో కూడా వర్షాలు తగ్గిపోవడంతో కరువు భయం పెరిగింది. ఈ సమయంలో కృష్ణమ్మ చేరడం రైతులకు జీవనాధారంగా మారింది. మొత్తం మీద, కుప్పం రైతుల దశాబ్దాల కలను సాకారం చేసిన చంద్రబాబు – అపారమైన హర్షం, ఆనందం, సంబరాలు ప్రజల్లో వెల్లివిరుస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: