ఏపీ కాంగ్రెస్‌లో ఇటీవల కొత్త అలజడి మొదలైంది. ముఖ్యంగా డిసిసి కమిటీల ఏర్పాటు ప్రకటన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. చాలా కాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు, క్రమంగా పార్టీ కోసం శ్రమిస్తున్న స్థానిక నాయకులు ఈసారి తప్పకుండా తమకు పదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం నుంచి అనకాపల్లి వరకు జిల్లా స్థాయిలో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే, చివరికి ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్ళిపోయింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలే అధిష్టానానికి లేఖ రాసి ఇప్పటికిప్పుడు డిసిసిల నియామకాలు చేయకూడదని సూచించార‌ట‌. ప్రస్తుతం పార్టీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయం సరైనది కాదని, కొత్త పదవులు ఇవ్వడం వల్ల స్థానికంగా అధికార కేంద్రాలు ఏర్పడి వర్గపోరు పెరిగే అవకాశముందని ఆమె అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.


అంతేకాకుండా, కొందరు నేతలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని, సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారని ఆమె అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని షర్మిల కోరినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ, దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు నిజానికి షర్మిలే సొంత అజెండాను నడుపుతున్నారని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఏక‌ప‌క్షంగా ముందుకు వెళుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలు మరోసారి కాంగ్రెస్‌లో విభేదాలను తెరపైకి తెచ్చాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అసంతృప్తి బహిరంగం అవుతోంది.


కొందరు నేతలు అంతర్గత చర్చల్లో “ఇక ఈ పరిస్థితి కొనసాగితే మనం పార్టీలో కొనసాగ‌డం కష్టమే” అని స్పష్టంగా చెబుతున్నారు. నిజానికి గత కొంతకాలంగా కాంగ్రెస్ నుంచి కొందరు కీలక నేతలు దూరమవుతూనే ఉన్నారు. ఇప్పుడు మరికొందరు కూడా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఏదేమైనా షర్మిల తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమెకు వ్యతిరేకంగా వినిపిస్తున్న స్వరాలు రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: