
2022లో ఆదిత్య కేడియా రియాల్టర్స్ సంస్థ రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ మండలంలోని మంచిరేవుల గ్రామంలో 9.19 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతిని జారీ చేసింది. అయితే, మూసీ నది బఫర్ జోన్ ను ఆక్రమించి అక్కడ రిటైనింగ్ వాల్ ను నిర్మించినట్లు 2023 జూలై 3న హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీలు తేలింది. దీంతో 2023 ఆగస్టు 2న ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థకు హెచ్ఎండీఏ షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఆ సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. 2023 ఆగస్టు 18న భవన నిర్మాణ అనుమతుల్ని హెచ్ఎండీఏ రద్దు చేసింది. అదేవిధంగా, రిటైనింగ్ వాల్‌ను తొలగించాలని ఆ సంస్థకు హెచ్ఎండిఏ ఆదేశాల్ని జారీ చేసింది.
* అనుమతిని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ.. ఆదిత్య సంస్థ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. మరోసారి జాయింట్ ఇన్స్‌పెక్షన్ చేసి నివేదికను ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యుల్ని జారీ చేసింది. దీంతో 2024 ఫిబ్రవరి 26న అధికారులు చేపట్టిన జాయింట్ ఇన్స్‌పెక్షన్‌లో.. ఆదిత్యా కేడియా రియల్టర్స్ సంస్థ ఆ రిటైనింగ్ వాల్‌ను తొలగించనట్లు తేలింది. దీంతో, ఆ ప్రాజెక్టు అనుమతిని పునరుద్ధరించాలని 2024 మార్చి 1న హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో, హెచ్ఎండీఏ అనుమతిని పునరుద్ధరించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఫలితంగా, 2024 జూన్ 20న అనుమతిని పునరుద్ధరించింది.
* మంచిరేవుల గ్రామంలోని సర్వే నెంబరు 476/AA1, 476/ AA2 లోని 9.19 ఎకరాల విస్తీర్ణంలో 38 అంతస్తుల బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ 12 మే 2022న హెచ్ఎండిఏ కార్యాలయానికి ఆదిత్య సంస్థ దరఖాస్తు చేసింది. ప్రతిపాదిత భూమికి సమీపంలో మూసీ నది ఉన్నట్లు గుర్తించి ఆ సంస్థను హెచ్ఎండీఏ ప్రశ్నించింది. అయితే, అంతకంటే ముందే, 2021 అక్టోబర్ 8న ఇరిగేషన్ శాఖ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఎన్వోసీలను హెచ్ఎండిఏ కు సమర్పించింది. ఆదిత్య కంపెనీ ప్రతిపాదనల్ని మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ (MSB) కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాతే.. భవన నిర్మాణ అనుమతులను ఇవ్వడానికి నిర్దేశిత ఫీజు చెల్లించాలని ఆ సంస్థకు సూచించింది. ఆ సొమ్ము చెల్లించాకే.. హెచ్ఎండిఏ 2022 ఆగస్టు 19న భవన నిర్మాణానికి అనుమతిని జారీ చేసింది.