ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం 2027 నాటికి అమరావతిలో తొలి దశ పనులను పూర్తి చేయాలని సంకల్పించగా, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సీఆర్డీఏ (Capital Region Development Authority) అధికారులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం రాజధానిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అందుకు అనుగుణంగా భారీగా ప్రాజెక్టుల‌ను అమలు చేస్తున్నామని వారు తెలిపారు. తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం, మొత్తం 54,693.09 కోట్ల రూపాయల విలువైన 90 ప్రాజెక్టులకు ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు లభించాయి.
 

వీటిలో 79 పనులు ప్రారంభమయ్యాయి. ఈ 79 ప్రాజెక్టులలో 19 పనులు సీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.12,762.46 కోట్లతో, మిగిలిన 60 పనులు ఏడీసీఎల్ (APCRDA Development Corporation Ltd) ద్వారా రూ.36,737.06 కోట్లతో నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం కలిపితే 49,499.52 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఇంకా మరో 7 ప్రాజెక్టులు టెండర్ల ప్రక్రియలో ఉండగా, మరో 5 ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. అదేవిధంగా రూ.36,577 కోట్ల విలువైన మరో 20 పనులకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉంది. అధికారుల ప్రకారం, ప్రస్తుతం వర్షాలు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు ఉన్నా పనుల ప్రగతి మీద ఎలాంటి ప్రభావం పడకుండా కొనసాగుతున్నాయట.

 

మంత్రి నారాయణ స్వయంగా ఈ నిర్మాణ పనుల పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా పలు విభాగాల ప్రధాన కార్యాలయాలు అమరావతిలో అందుబాటులోకి రావడంతో రాజధాని అభివృద్ధికి మరింత వేగం చేరినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం స్పష్టంగా తన లక్ష్యాలను నిర్ణయించుకుని, వాటిని సమయానుకూలంగా సాధించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ప్రజలు అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతి రాజధాని ప్రాజెక్టు, ఎట్టకేలకు పూర్తి అవతల చూసే దశలోకి ప్రవేశిస్తోంది. ఈ వేగంతో కొనసాగితే, అమరావతి ఒక ప్రగతిశీల, సమగ్ర రాజధానిగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: