
జ్యోతిబసు రికార్డు బ్రేక్, 2036 వరకు సీఎం! .. ఇక బెంగాల్ రాజకీయాల విషయానికొస్తే, మమతా బెనర్జీ.. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొడతారని కునాల్ ఘోష్ జోస్యం చెప్పారు. 1977 నుంచి 2000 వరకు 23 ఏళ్ల పాటు జ్యోతిబసు బెంగాల్‌ను పాలించారు. మమత 2026 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుని రికార్డు సృష్టిస్తారు. అయితే, ఆమె 2036 వరకు బెంగాల్ సీఎంగా కొనసాగుతారని ఘోష్ చెప్పడం గమనార్హం. మరి, ఒకవైపు బెంగాల్ ముఖ్యమంత్రిగా 2036 వరకు ఉంటారని చెబుతూనే, మరోవైపు 2029లోనే ప్రధాని అవుతారని చెప్పడం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి సమాధానంగా, కునాల్ ఘోష్ తన జోస్యాన్ని దేనికైనా సిద్ధమనే విధంగా చెబుతున్నారు. మమత కచ్చితంగా 2029లో ప్రధాని అవుతారని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగుతారని ఆయన అంటున్నారు. ఆమె తర్వాత అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి అవుతారని కూడా ఘోష్ పేర్కొన్నారు.
రాహుల్ సంగతి ఏంటి? .. కునాల్ ఘోష్ వ్యాఖ్యలు ఇండియా కూటమిలో చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. కూటమిలో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారనే అంచనాలు ఉండగా, మమతకు ప్రధాని పట్టం కట్టేస్తే రాహుల్ పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా, ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న ఇండియా కూటమిలోని ఇతర మిత్రపక్షాల పరిస్థితి ఏమిటన్నది కూడా చర్చనీయాంశమైంది. తమ అధినేత్రి మెప్పు పొందేందుకు, బీజేపీని విమర్శించేందుకు కునాల్ ఘోష్ తొందరపడి ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించారని కొందరు అంటున్నారు. 2026 ఎన్నికలు తృణమూల్‌కు ఒక పెద్ద సవాలుగా ఉన్న తరుణంలో, ఈ సీనియర్ నేత వ్యాఖ్యలు పార్టీకి తాత్కాలిక బూస్టింగ్ ఇచ్చినా, వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.