ఏమాటకామాట చెప్పాలంటే… ఒకప్పుడు ఏపీలో వైసీపీకి అజేయమైన కోట‌లా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు మౌనంగా మారిపోయాయి. ఆ పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్నా, స్థానిక నేత‌ల దూకుడుతో గ‌తంలో రెచ్చిపోయిన ఆ వాయిస్‌లు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యాయ‌న్న మాట. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేకపోయినా కూడా తమ ప్రభావాన్ని చూపిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా నిష్క్రియలైపోతున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర పరాజయం త‌ర్వాత ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.


ముందుగా ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజకవర్గం తీసుకుంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు వినగానే అధికార యంత్రాంగమే ఒక్కసారిగా కుదిపేసేది. ఆయన సోదరుల హవా అంతలా ఉండేది - ఆ గీత దాటితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయన్న భయం అందరిలో ఉండేది. టీడీపీ నేతలు సైతం పిన్నెల్లి ప్రభావం నుంచి తప్పించుకోవటానికి వేరే ప్రాంతాలకే తరలిపోయారు. కానీ ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కేసుల ఊబిలో పిన్నెల్లి సోదరులు చిక్కుకోవడంతో వారి వాయిస్ పూర్తిగా మూగబోయింది. పిన్నెల్లి హవా అనేది గతం అయిపోయింది.



మరొక ఉదాహరణ - మంగ‌ళ‌గిరి. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పేరే ఓ సెన్సేషన్‌గా ఉండేది. ఒకప్పుడు ఆయన వ‌ర్గం దూకుడుతో వైసీపీ జెండా రెపరెపలాడింది. కానీ ఎన్నిక‌ల ముందు పార్టీ మార్పులు, అంతర్గత గంద‌ర‌గోళాలు వైసీపీని ఈ నియోజకవర్గంలో కుదేలు చేశాయి. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారు అనే సమాచారమూ స్పష్టంగా లేని స్థితి. ఒకప్పుడు రచ్చరచ్చ చేసిన వైసీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు కన్పించ‌డం లేదు. చంద్రగిరి కూడా అదే దృశ్యం. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిల దూకుడు కారణంగా వైసీపీకి ఇక్కడ బలమైన పట్టు ఏర్పడింది. కానీ అక్రమ మద్యం వ్యవహారం, అవినీతి ఆరోపణలతో వారి ఇమేజ్ దెబ్బతింది. మరోవైపు టీడీపీ ఇక్కడ మళ్లీ పుంజుకోవడంతో వైసీపీ బలహీనమైంది.



 గుడివాడలో కొడాలి నాని దాదాపు 25 సంవత్సరాల పాటు ఆధిపత్యం చెలాయించారు. “నాని అన్న మాటే చట్టం” అనేంతగా ఫాలోయింగ్ ఉన్నా, ఇప్పుడు ఆయన ఊసే లేదు. గ‌న్న‌వ‌రంలో కూడా అదే సీన్. మొత్తం చూస్తే దాదాపు 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వాయిస్ పూర్తిగా కొలాప్స్ అయ్యింద‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఒకప్పుడు పటిష్టమైన కేడర్, ప్రబలమైన నాయకత్వం ఇప్పుడు మాయమవ్వడంతో పార్టీకి కొత్త ప్రాణం పోసే సవాలు జగన్ ముందుంది. ఈ మౌనం కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పునరాగమనం అంత ఈజీ కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: