మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారారు. ఎప్పుడూ దూకుడుగా, సూటిగా మాట్లాడే ఆళ్ల.. ఈ మధ్యన మాత్రం పూర్తిగా మౌనం వీడారు. రాజకీయాలకే దూరంగా ఉంటూ తన వ్యాపారాలు, వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. వైసీపీ ఓటమి తర్వాత ఆళ్ల కనిపించకపోవడంతో ఆయన భవిష్యత్తుపై పలు రకాల చర్చలు మొదలయ్యాయి. “ఆళ్ల ఇక రాజకీయాలకే గుడ్‌బై చెప్పేశారా?” అనే సందేహం కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. 2014, 2019ల్లో వరసగా మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి మంచి బలమైన నేత. ముఖ్యంగా 2019లో నారా లోకేష్‌పై విజయం సాధించి జగన్ దృష్టిని ఆకర్షించారు.
 

అయితే ఆశించిన మంత్రిపదవి రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ అసంతృప్తితో ఎమ్మెల్యే పదవికీ, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఆళ్ల, అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేక తిరిగి వైసీపీ కాంప్‌ చేరారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుపై కేసులు వేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలను బలంగా సమర్థిస్తూ హాట్ సీట్‌లో ఉన్న ఆళ్ల.. ఇప్పుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తున్నారు. కారణం ఏమిటంటే? రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనపై కేసులు తిరిగి తెరపైకి రావచ్చని, అరెస్ట్ అవుతాననే భయంతో కొంతకాలం ‘లో ప్రొఫైల్‌’గా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఇక మరోవైపు రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయాలంటే మంగళగిరి కాదని, సత్తెనపల్లి సీటు ఇవ్వాలని జగన్‌ను కోరినట్లు చెబుతున్నారు.

 

“సత్తెనపల్లి అయితే గెలుపు ఖాయం” అని ఆళ్ల నమ్మకంగా చెబుతున్నారట. కానీ ఆ నియోజకవర్గంలో ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు ఉన్నందున జగన్ హామీ ఇవ్వలేకపోతున్నారట. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పూర్తిగా మౌనంగా ఉంటున్నారని టాక్‌. ఇక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే – ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ నిశ్శబ్దం వెనక పెద్ద ప్లాన్ ఉండొచ్చని. సత్తెనపల్లిపై క్లారిటీ వచ్చే వరకు మౌనం పాటిస్తూ, తగిన సమయానికి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారట. ఒకవేళ సీటు దక్కకపోతే ఈసారి పోటీ చేయబోనని ఆయన ఇప్పటికే సిగ్నల్ ఇచ్చారట. ఏదేమైనా మంగళగిరి రాజకీయాల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి మౌనం వెనక అసలు రహస్యమేమిటో చూడాలి. మళ్లీ రాజకీయాల్లో దూకుడుగా రంగప్రవేశం చేస్తారా? లేక రైతు, వ్యాపారవేత్తగా జీవితం సాగిస్తారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: