మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ పై ఉన్నా దాదాపు ఆరేళ్ల అనంతరం వ్యక్తిగతంగా నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కానీ ఈ హాజరు కంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న విషయం ఆయన అభిమానులు హైదరాబాదులో సృష్టించిన హంగామా. ముఖ్యంగా బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు తీసుకెళ్లిన భారీ ర్యాలీ, ప్రదర్శించిన పోస్టర్లు, వినిపించిన నినాదాలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా విస్తృత చర్చకు దారి తీశాయి. జగన్‌ కోర్టు ప్రయాణం సందర్భంగా అభిమానులు మ‌హేష్ బాబు - జగన్ - కేటీఆర్ ఫ్లెక్సీలు ప్రదర్శించడం, ‘2029 లో రప్పా రప్పా’ వంటి నినాదాలు బ్యానర్లపై రాయడం విశేషంగా నిలిచింది. ఈ నినాదం పుష్ప సినిమాలోని డైలాగుకు అనుసంధానం కావడంతో మరింత దృష్టిని ఆకర్షించింది. గతంలోనూ పల్నాడు పర్యటన సందర్భంగా ఇదే నినాదంతో ఒక యువకుడు ప్రదర్శన చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే జగన్ ఆ సమయంలో సినిమా డైలాగు అంటే తప్పేంటి అని సమర్థించడం అభిమానుల్లో మరింత ధైర్యం నింపినట్లుగా కనిపిస్తోంది.


ఈసారి కూడా అభిమానులు తమ ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోయారు. కోర్టు పరిసరాల్లో గుంపులుగా చేరి నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. పోలీసులు చివరి దశలో ర్యాలీని అడ్డుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ జనసామూహిక ప్రదర్శనను ఆపడం కష్టమైంది. జగన్ వాహనం వెళ్తుండగా అభిమానులకు అభివాదం చేస్తూ లోటస్ పాండ్‌ వైపు వెళ్లిపోయారు. ఆయనను అనుసరించే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు కదిలారు. ఇలాంటి ర్యాలీలు, పోస్టర్లు, రాజకీయ సందేశాలు కోర్టు హాజరు నేపథ్యంలో రావడం అనేక విమర్శలకు దారితీసింది.


జగన్ ప్రజాదరణను చూపించడానికి ఆయన అనుచరులు కావాలనే బలం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ విశ్లేషకులు దీనిని కోర్టు హాజరు అవసరం లేకపోవచ్చని ఒత్తిడి సృష్టించే ప్రయత్నంగా కూడా చ‌ర్చించుకున్నారు.ఏది ఏమైనా… న్యాయస్థానానికి హాజరవుతున్న సందర్భంలో ఇలాంటి అతిశయ ప్రదర్శనలు జరగడం సరికాదని న్యాయవాదులు, రాజకీయులు వ్యాఖ్యానిస్తున్నారు. అభిమానుల భావోద్వేగం అర్థమయ్యే అంశమే కానీ, కోర్టుల ముందు ఈ రకం పోస్టర్లు, సినిమా డైలాగులు ప్రదర్శించడం స‌రికాద‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP