జలమండలి చేపడుతున్న కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు చాలా అద్భుతంగా ఉన్నాయని జాతీయ సఫాయి కర్మాచారి కమీషన్ సభ్యుడు జగదీష్ హిరేమని  తెలిపారు. సెప్టెంబర్ 19న హైదరాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.  ఆయన జలమండలి ఎండీ. ఎం. దానకిషోర్ తో కలిసి సెవరెజీ కార్మికులకు అందిస్తున్న ప్రయోజనాలపై  ఉన్నతాధికారులు, యూనియన్ ప్రతినిధులు,  మినీ జెట్టింగ్ యంత్రాల యాజమానులతో సమీక్షా  సమావేశం నిర్వహించారు. కమీషన్ సభ్యుడు జగదీష్ హిరేమని మాట్లాడుతూ జలమండలి చేపడుతున్న కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు చాలా అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. హైదరాబాద్ జలమండలి మానవ రహిత పారిశుద్ద్య పనులు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు. కార్మికులు మ్యాన్ హోల్ లోకి దిగకుండా యంత్రాల ద్వారా శుభ్రం చేయడం మంచి పరిణామం అన్నారు.



కేంద్ర ప్రభుత్వం 2013లో స్కావెంజింగ్ లో ప్రవేశపెట్టిన మ్యానువల్ టు మెకానిజమ్ అనే పథకాన్ని మొదటగా హైదరాబాద్ జలమండలినే ఆచరించిందని తెలిపారు. దేశంలోని పెద్ద పెద్ద నగరాలు సైతం చేయని విధంగా మినీ జెట్టింగ్ యంత్రాలను ఆవిష్కరించడం ప్రశంసనీయమన్నారు. ఈ చర్యతో దేశానికే హైదరాబాద్ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. హైదరాబాద్ యంత్రాలను చూసి ఢిల్లీ, బెంగుళూరు వంటి మహానగరాలు కూడా  అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ జెట్టింగ్ యంత్రాల ద్వారా స్కావెంజింగ్ పనులు చేపట్టే కుటుంబాలే కాంట్రాక్టర్ లుగా మారడం అభినందించదగ్గ విషయం అని అన్నారు. ఇంతటితో ఆగకుండా ఇంకా మరెన్నో నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్న  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.




జలమండలి ఎండీ దానకిషోర్ పారిశుద్ధ్యంలో జలమండలి చేపడుతున్న కార్యక్రమాలు, నూతన యంత్రాలు, రక్షణ చర్యలపై కమీషన్ సభ్యుడు జగదీష్ హిరెమని ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్మికులు మ్యాన్ హోళ్లలోకి దిగి పారిశుద్య పనులు చేయడం 2016లోనే నిషేదించినట్లు తెలిపారు. పారిశుద్య పనుల్లో ఇబ్బందులు కలగకుండా 58 జెట్టింగ్ యంత్రాలకు తోడు 72 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసకువచ్చినట్లు వివరించారు. అలాగే మ్యాన్ హోళ్లలోని అడ్డంకులకు తొలగించేందుకు రోబోటిక్ యంత్రాలు, పైపులైనులో ఉన్న వాయువులను గుర్తించేందుకు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్-2 డైరెక్టర్ పి. రవి, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్  లతో పాటు జలమండలి సీజీఎమ్ లు, పలు యూనియన్ల ప్రతినిధులు, మినీ జెట్టింగ్ యంత్రాల యాజమానులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: