నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. నవలా నాయకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన సినిమాలు మరపురానివి. ఆయన తన 70 సంవత్సరాల కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి భారతీయ సినిమా లోని గొప్ప నటీ నటులలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మూల స్తంభంగా నిలిచారు.
 
1923 సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా రామాపురం లో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించిన ఐదవ కుమారుడు నాగేశ్వరరావు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతగా బాలేని కారణంగా ఆయన ప్రాథమిక విద్య తోనే పాఠశాలకు స్వస్తి పలికారు. పదేళ్ల వయసులో లలితకళల రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ప్రముఖ రంగస్థల నటుడిగా మారారు. ఆ సమయంలోనే సినీ నిర్మాత ఘంటశాల బలరామయ్య కలుసుకోవడంతో అక్కినేని కెరీర్ మలుపు తిరిగింది.

అలా మొదలైన ఆయన కెరీర్ తెలుగు, తమిళ, హిందీ, భాషల్లో నిరాటంకంగా సాగడంతో తుదిశ్వాస విడిచేంత వరకూ 225 చిత్రాల్లో నటించారు. కమర్షియల్ సినిమాల్లోనే కాకుండా పౌరాణిక, సాంఘిక సినిమాలలో కూడా అక్కినేని మెప్పించారు. 1953లో వచ్చిన 'దేవదాసు' చిత్రం అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన నటించిన లైలా మజ్ను, అనార్కలి, ప్రేమనగర్ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలు అప్పటి యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మాయాబజార్, మహాకవి కాళిదాసు, భక్తతుకారం వంటి పౌరాణిక చిత్రాలు కూడా అక్కినేని నటనా ప్రతిభకు అద్దం పట్టాయి.సంసారం, బ్రతుకుతెరువు, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, మాంగల్య బలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగునీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజీ బుల్లోడు వంటి సినిమాలు కమర్షియల్ గానూ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి.

1949 ఫిబ్రవరి 18న అక్కినేని అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నాగార్జున, వెంకటరత్నం, సత్య వతి, సరోజా, నాగసుశీల అనే ఐదుగురు పిల్లలు. ఆయన భార్య పేరు మీదే 1985లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. ఈ స్టూడియో పై పలు సినిమాలు నిర్మించారు. 2011లో అన్నపూర్ణమ్మ సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 60 ఏళ్ల ఆయన సుదీర్ఘ సినీ కెరీర్ లో 7 రాష్ట్ర నంది అవార్డులు, ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ అందుకున్నారు. సినీరంగంలోని అత్యున్నత భారతీయ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీ చేసిన కృషికి గాను భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. అలా ఆయన కన్నుమూసే వరకు సినిమాల్లో నటించారు ఆయన చివరి చిత్రం "మనం".


మరింత సమాచారం తెలుసుకోండి:

ANR