అఖండ మెజారిటితో వైసిపి ఎన్నికల్లో గెలిచి ఏడాది కూడా కాకముందే నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు కేంద్రంగా వివాదం మొదలైన విషయం అందరికీ తెలిసిందే.  ఈ రాజుగారు నిజానికి ఏ పార్టీకి కూడా విధేయుడిగా ఉండడని అన్నీ పార్టీల నేతల్లోను బలమైన అభిప్రాయముంది.  ముందు వైసిపిలో చేరాడు. తర్వాత బిజెపిలోకి మారాడు. ఆ తర్వాత టిడిపిలోకి జంప్ చేశాడు. ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ టికెట్ ఖాయం చేసినా కాదని చివరినిముషంలో వైసిపిలో చేరాడు. మొత్తానికి నానా అవస్తలుపడి మొదటిసారి సుమారు 30 వేల మెజారిటితో ఎంపిగా గెలిచాడు.  సమస్యంతా ఇక్కడి నుండే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియాతో తరచు మాట్లాడటం, వివాదాస్పద వ్యాఖ్యలు  చేయటంతో  రాజుకు బాగా  ప్రచారం వచ్చింది.

 

ఎల్లోమీడియా కూడా ఏమి చేస్తోందంటూ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపికి ఉద్దేశ్యపూర్వకంగానే ప్రచారం కల్పిస్తోంది. ఎంపి మాటలు ఏ స్ధాయికి వెళ్ళాయంటే తనను బతిమలాడుకుంటేనే పార్టీలో చేరానని, తాను పోటి చేయబట్టే వైసిపి ఇక్కడ గెలిచిందని చెప్పటం సంచలనంగా మారింది. జగన్ ఇమేజితో కాకుండా తన సొంత ఇమేజితోనే  గెలిచినట్లు చెప్పటంతో పార్టీలో బాగా రచ్చ మొదలైంది.  నిజానికి ఎంపిగా గెలిచినప్పటి నుండి కూడా కృష్ణంరాజు పార్టీలైన్ మీద కాకుండా సొంత అజెండాతోనే వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. అనవసర మాటలు మాట్లాడటం వల్లే ఇపుడు రచ్చ పెరిగిపోతోందన్నది వాస్తవం.

 

ఇంతకీ గెలిచిన తర్వాత జగన్-ఎంపి మధ్య ఏమి జరిగింది. ఎంపి పదే పదే జగన్ను టార్గెట్ చేసుకుని ఎందుకు రెచ్చిపోతున్నాడు ? అనేది ఇపుడు అందరిలోను వినిపిస్తున్న ప్రశ్న. ఇదే విషయమై సోషల్ మీడియాలో  ఓ పోస్టు వైరల్ అయ్యింది. దాని ప్రకారం ఏమిటంటే కృష్ణంరాజుకు 2010 నుండి ఈస్ట్ కోస్ట్ పవర్ పేరుతో ఓ పవర్ ప్రాజెక్టుందట. డబ్బులు అవసరమై దానిమీద కృష్ణంరాజు రూ. 947 కోట్లు లోన్ తీసుకున్నాడట. లోన్ అయితే తీసుకున్నాడు కానీ తిరిగి అప్పు మాత్రం తీర్చలేదట. దాంతో అప్పు ఇచ్చిన వాళ్ళు రాజు మీద లీగల్ గా ప్రొసీడ్ అయ్యారని సమాచారం. దాంతో న్యూఢిల్లీలోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో 106/18 నెంబర్ తో ఓ కేసు నమోదైంది. ఆ కేసే ఇపుడు విచారణకు వచ్చిందట.

 

తనపై నమోదైన కేసులో నుండి బయటపడేందుకు రాజు నానా అవస్తలు పడుతున్నా సాధ్యం కావటం లేదట. ఈ కేసులో నుండి బయటపడేందుకు 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబునాయుడు ద్వారా రాజు ప్రయత్నం చేశాడని సమాచారం. తన పవర్ ప్లాంట్ ద్వారా కరెంటు కొనుగోలు చేసేందుకు అప్పట్లో  ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కూడా దాదాపు అయినట్లేనట. అయితే సదరు కాంట్రాక్టు వాస్తవ రూపం దాల్చేసమయానికి ఎన్నికలు రావటంతో ఎక్కడి ప్రయత్నాలు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడైతే వైసిపి అధికారంలోకి రావటం, రాజు కూడా ఎంపిగా గెలిచాడో వెంటనే పావులు కదపటం మొదలుపెట్టాడని సమాచారం.

 

తన ప్లాంటులో కరెంటు కొనిపించటం ద్వారా తన సమస్యల నుండి బయటపడవచ్చని రాజు అనుకున్నాడట. ఇదే విషయాన్ని జగన్ ను కలసినపుడు ప్రతిపాదన చేసినట్లు ప్రచారంలో ఉంది. అయితే అప్పటికే విద్యుత్ టారిఫ్ ను తగ్గించాలని, విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో మాట్లాడి ధరలు తగ్గించాలనే ఆలోచనలో ఉన్న జగన్  తన ఎంపి ప్రతిపాదనను కుదరదు పొమ్మన్నాడట. ఎంత ఒత్తిడి పెట్టయినా ప్రభుత్వంతో  తన ప్లాంటులో విద్యుత్ ను కొనిపించాలని ట్రై చేసినా సాధ్యం కాకపోవటంతో అప్పటి నుండి జగన్ పై కక్షపెంచుకున్నట్లు పోస్టులో ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమన్న విషయాన్ని ఎంపినే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: