అసలే ప్రభుత్వం పరిస్దితి అంతంతమాత్రంగా ఉంది. వరుసబెట్టి దేవాలయాల రథాలపై దాడులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల విగ్రహాలు కూలిపోతున్నాయి. అంతర్వేథిలో లక్ష్మీనరసింహ స్వామి దేవస్ధానం రథం దగ్దమైన ఘటన తర్వాత మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఘటనల వెనుక ఎవరున్నారు ? ఉద్రిక్తతలను ఎవరు పెంచుతున్నారనే విషయాన్ని పక్కనపెట్టేద్దాం. మొత్తానికి ధార్మిక విషయాల్లో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందన్నది వాస్తవం. మరి ఇటువంటి సమయంలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి వచ్చిన అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదనే వివాదం ఎందుకు రేగినట్లు ?


 


ఎందుకంటే, కొందరు పెద్దలు చేస్తున్న అనాలోచిత వ్యవహారాల వల్లే టిటిడి తరచూ వివాదాల్లో కూరుకుపోతోంది. తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే అన్యమతస్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తమకు శ్రీ వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఫారంపై ప్రముఖులు సంతకాలు చేస్తారు. దర్శనానకి వచ్చినపుడు  గతంలో కొందరు సంతకాలు చేశారు, కొందరు చేయలేదు. నిజానికి ఇది ప్రముఖుల వ్యక్తిగత విషయం. దీనికి మిగిలిన జనాలకు ఏమాత్రం సంబంధం లేదు.




 

కానీ ఇపుడు  ఈ డిక్లరేషన్ విషయం కూడా పెద్ద వివాదమైపోతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి హిందువు కాదనే వాదనను కొందరు జనాల్లోకి పదే పదే తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సొంతపార్టీ ఎంపి రఘురామ కృష్ణంరాజు చేస్తున్న ఇటువంటి ఆరోపణలకు చంద్రబాబునాయుడు లాంటి వాళ్ళ మద్దతుగా మాట్లాడుతున్నారు. తమ రాజకీయానికి, జగన్ను ఇబ్బంది పెట్టటానికి వీళ్ళు మతాన్ని ఓ పావుగా ఉపయోగించుకోవటమే తప్పు.  అలాంటిది ప్రభుత్వంలోని ప్రముఖులు కూడా అనాలోచితంగా అందులో ఆజ్యం పోసేట్లు మాట్లాడటం ఇంకా తప్పు.





ఇపుడు టిటిడి దర్శనాల విషయంలో  జరిగిందిదే. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు కథనాలు, వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో రాజకీయపార్టీలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయం మొదలుపెట్టేశాయి. జగన్ కోసం టిటిడి సంప్రదాయాలనే మార్చేస్తారా ? జగన్ వల్ల హిందూమత విశ్వాశాలు దెబ్బతింటున్నాయంటూ చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కాకముందు కూడా జగన్ తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఎన్నిసార్లు తిరుమలకు వచ్చి దర్శనాలు చేసుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.




అలాంటిది జగన్ సిఎం అయిన తర్వాత మాత్రమే ఎందుకు తిరుమల దర్శనాలను వివాదం చేస్తున్నారు ? ఎందుకంటే ఇది రాజకీయం చేయటం తప్ప మరోటికాదు. ఈ విషయాన్ని గుర్తించకుండా వైవి సుబ్బారెడ్డి అనవసరంగా డిక్లరేషన్ వివాదాన్ని కదలించారు. జగన్ హిందువా ? కాదా ? అన్న విషయాన్ని పార్టీ పరంగా నేతలు చూసుకుంటారు. మధ్యలో వైవి ఎందుకు వేలుపెట్టాలి.  అన్యమతస్తులు  డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని తాను అనలేదని వైవి మొత్తుకుంటున్నా ప్రతిపక్షాలు, మీడియా ఒప్పుకోవటం లేదు. కాబట్టి బాధ్యతాయుత స్ధానాల్లో ఉన్న వాళ్ళు  ఏమి మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడలి. లేకపోతే సున్నితమైన విషయాల్లో తమంతట తామే చెత్తవేసుకున్నట్లవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: