సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ నటుడు. ఈయన పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, విశాఖ సింగ్ అనే దంపతులకు జన్మించారు. వీరికి ఒక అక్క కూడా ఉంది. ఈమె పేరు మితూ సింగ్. ఈమె రాష్ట్రస్థాయి క్రికెటర్. సుశాంత్ కు 15 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన తల్లి 2002లో మరణించారు. ఇక అదే సంవత్సరంలోనే వీరు కుటుంబం మొత్తం ఢిల్లీకి వెళ్లారు. రాజ్ పుత్ పాట్నా లో చదువుకుంటున్న సమయంలో సెయింట్ కరెన్స్ హైస్కూల్లో తన విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టగా, తర్వాత ఢిల్లీకి వెళ్లి అక్కడ కులాచి హన్సరాజ్ మోడల్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తిచేశారు.
సుశాంత్ 2003లో డి సి ఇ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి , అక్కడ దేశవ్యాప్తంగా ఏడవ ర్యాంక్ సాధించారు. ఇక అదే కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నారు. అయితే నటన మీద ఆసక్తితో నాలుగేళ్లు పూర్తి చేయాల్సిన ఇంజనీరింగ్ కోర్సులో మూడేళ్లు మాత్రమే పూర్తి చేసి , అక్కడి నుండి నటనా రంగంలోకి ప్రవేశించారు. ఒక కళ  డాన్స్ గ్రూప్ లో చేరి 2005లో 51 వ ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్ లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా డాన్స్ చేశారు. 2006లో అదే డాన్స్ గ్రూప్ తో ఆస్ట్రేలియా కామన్వెల్త్ ఓపెనింగ్ కి ఏర్పాటు చేసిన  కల్చరల్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఇక అక్కడ ఆ ప్రోగ్రాం మంచి విజయం సాధించడంతో, అక్కడినుంచి ఇండియా తిరిగి వచ్చి ఇక నటనపై ఆసక్తి చూపించాలని అనుకున్నాడు.
మొట్టమొదటిసారి టెలివిజన్ ధారావాహికలతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 2008లో స్టార్ ప్లస్ లో ప్రసారం అయిన కిస్ దేశ్ మెయ్ హై మెరా దిల్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించారు. ఇక ఆ తర్వాత జీ టీవీ సీరియల్ అయిన పవిత్ర రిస్ట లో కూడా నటించారు. ఇక ఆయన నటనతో ఫిదా అయినా దర్శకనిర్మాతలు వెండితెరపై మొదటిసారి 2013లో విడుదలైన కాయ్ పో చెయ్ అనే చిత్రం ద్వారా మొట్టమొదటిసారి వెండితెరకు హీరోగా పరిచయం చేశారు. తరువాత ఎంఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం లో మెయిన్ రోల్ పోషించి, అందరి చేత ప్రశంసలు పొందటంతో పాటు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకి కూడా మొదటిసారి నామినేషన్ అందుకున్నాడు. మరి కొన్ని సినిమాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.ఇక చివరిగా జూన్ 14 2020 వ సంవత్సరంలో, కేవలం 34 సంవత్సరాల వయసులోనే ముంబైలోని బాంద్రాలో, తన ఇంట్లో రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఆయన ఊపిరి అందుకనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని నిర్ధారించారు. అంతేకాదు ఆయన మరణం వెనుక ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నట్టు కూడా పుకార్లు రేగాయి. అంతే కాకుండా మరికొంత మంది హీరోయిన్లను కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో అరెస్టు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: