కర్రలతో రక్త తర్పణానికి
సైరా అంటున్నారు దేవరగుట్ట భక్తజనులు. ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు జరిగే కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాలు సిద్ధమయ్యాయి. ఏటా
దసరా పర్వదినం నాడు జరిగే ఈ ఆచార రణరంగానికి సర్వం సిద్ధమైంది. ఈ సమరానికి దేవరగుట్ట వేదికగా నిలుస్తుంది. ఆ గ్రామ పరిసర ప్రాంతవాసులు అనాదిగా ఆచారంగా వస్తుంది. దేవరగట్టు కొండలో వెలసిన మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కొత్తపేట, నెరణికి తండా గ్రామాలు ఒకవైపు...అరికెర, ఆలూరు, బిలేహల్, ఎల్లార్తి, సులువాయి, విరూపాపురం, నిత్రవట్టి గ్రామాలు మరోవైపు వర్గాలుగా విడిపోయి. ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో తలపడతారు. ప్రతి ఏటా విజయదశమి పర్వదినాన ఇక్కడ బన్ని ఉత్సవం జరుగుతుంది.
దసరా ఉత్సవాల్లో భాగంగా దేవరగట్టు జైత్రయాత్ర పేరుతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. చూసేవారికి అది కర్రలయుద్ధం.. కానీ ఆ పల్లెవాసులకు మాత్రం సంబరం. ఈ సమరానికి బన్ని ఉత్సవంగానూ పేరుంది.
దేవరగట్టు కర్రల సమరం తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఆచారం పేరిట ఏటా ఈ రక్తపాతం సాగుతూనే ఉంది. కొంతమంది కర్రలకు ఇనుప రింగులు తొడిగి బన్ని ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలు పగిలి, గాయాల తీవ్రత పెరుగుతుంటాయి. ప్రాణపాయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కర్రలతో తలపడే ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, ఎలాంటి రక్తపాతాలకు తావులేకుండా జరుపుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. ఉత్సవంలో ఎవరూ రింగు కర్రలు వాడవద్దన్న ఆయన.. ఎవరైనా అల్లర్లు, గొడవలు సృష్టిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.