ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు తమ ఆరాధ్యదైవం ఏసు జన్మదినం డిసెంబర్ 25న పుట్టిన రోజునే క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల ముందు నుంచే ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. మిరుమిట్లు గొలిపే కాంతివంతమైన స్టార్స్‌తోపాటు అలంకరణలతో నిండిన క్రిస్మస్ ట్రీ, గిఫ్ట్‌లు, శాంటస్ వంటివి క్రిస్మస్‌కు ఆహ్వానం పలుకుతాయి. ఇక క్రిస్మస్ వేడుకల్లో ప్రధానాకర్షణ క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ రాక ముందు నుంచే ఈ చెట్టును తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు క్రైస్తవులు.
ఇప్పుడైతే అనేక రకాల కృత్రిమ క్రిస్టమస్ చెట్లు అందుబాటులో ఉన్నాయి గానీ.. కొన్ని సంవత్సరాల క్రితమైతే నిత్యం పచ్చగా వుండే పైన్ చెట్లను మాత్రమే క్రిస్మస్ చెట్టుగా అలంకరించేవాళ్లు. అయితే అసలు క్రిస్మస్ చెట్టును ఎందుకు పెడతారో తెలుసా.. 15వ శతాబ్ధం నుంచి క్రిస్మస్ ట్రీని నెలకొల్పుకోవడం ఆచారంగా ఉండేదంటారు. గతంలో ఓకు చెట్టు కొమ్మలు తెచ్చి, దానిని క్రిస్మస్ ట్రీగా అలంకరించేవారట. ఆ చెట్టు ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా భావిస్తారు. క్రిస్మస్ చెట్టును కొందరు ప్యారడైజ్ ట్రీగా కూడా వ్యవహరిస్తారు.
క్రిస్మస్ ట్రీకి ఉపయోగించే పచ్చని ఫిర్ అనే చెట్టు మాదిరిగానే, మనుషుల జీవితాలు పచ్చగా ఉండాలి అనేదానికి ఈ క్రిస్మస్ ట్రీ ఓ నమ్మిక. పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు. అలాగే క్రిస్మస్ చెట్టు వెనక అనేక కథలు కూడా ఉన్నాయి. ఇక క్రిస్మస్‌ను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుతారు. కుటుంబ సమేతంగా జీవితానికి సరిపడా ప్రత్యేక జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు ఏడాది పొడవునా ఈ రోజు కోసం ఆశగా ఎదురుచూసేవారు చాలామందే ఉంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి