
శాస్త్రం ప్రకారం శివుడిని దర్శించుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తులు శివాలయంలోకి అడుగుపెట్టిన తరువాత మొదట నంది దర్శనం చేసుకుని నంది రెండు కొమ్ముల నుంచి లింగాన్ని చూడటం, నంది చెవిలో అభీష్టాలను చెప్పుకోవడం చేస్తారు. శివుడు పరమేశ్వరుని అనుంగ భక్తుడు కాబట్టే అంత ప్రాధాన్యత ఉంటుంది. ఏ శివాలయంలోనైనా శివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తాడు.
సాధారణంగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడి రూపాన్ని మనస్సు సులభంగా గ్రహించగలుగుతుంది. లింగ రూపంలో ఉండే స్వామి రూపాన్ని దర్శించుకోవాలంటే మాత్రం మనస్సును కేంద్రీకృతం చేయాలి. శివుడిని ఎల్లప్పుడూ నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దర్శనం చేసుకోవాలి. ఇలా చేస్తే నంది అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు పొందుతాము. కోరికలను కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి గోత్రం, పేరు చెప్పి చెబితే మంచిది.
శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రపంచమే తల్లడిల్లుతుంది కాబట్టి నేరుగా శివుని ముందుకు వెళ్లరాదని... మొదట నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకుని ఆ తర్వాతే లోపలికి ప్రవేశించాలని పండితులు సూచిస్తున్నారు. నందీశ్వరుడి వృషభ భాగాన్ని సృశిస్తూ శివుని దర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించిన భక్తులకు కైలాసం ప్రాప్తిస్తుందని శివ పురాణం చెబుతోంది.